Jul 21,2023 21:22

నేతన్న నేస్తం మెగా చెక్కును అందిస్తున్న ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం

        మడకశిర : ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. మడకశిర పట్టణంలోని టిటిడి కల్యాణ మండపంలో జిల్లా స్థాయి నేతన్న నేస్తం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్‌ చైర్మన్‌ రమణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ కొండయ్య, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకొచ్చిన నాలుగేళ్లలో దాదాపు 99 శాతంపైగా హామీలను అమలు చేశారన్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రజల సమస్యలను ఆయా గ్రామాల్లోనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నేతన్న నేస్తం సాయం చేనేత కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద అర్హత కలిగిన 16,049 మంది చేనేత కుటుంబాలకు 24 వేల చొప్పున రూ.38.51 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అనంతరం చేనేతలకు రూ.38.51 కోట్ల మెగా చెక్కును కార్మికులకు అందజేశారు.
మడకశిర నియోజకవర్గం అభివద్ధికి చర్యలు
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం

మడకశిర నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోందని, ఇందుకు తగ్గట్టుగానే ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. టిటిడి కల్యాణ మండపంలో శుక్రవారం నాడు మడకశిర నియోజకవర్గ అభివద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఇన్‌ఛార్జి మంత్రితో ఆపటు కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నవరత్న పథకాల ద్వారా అర్హులందరికీ న్యాయం చేయాలన్నారు. సంక్షేమం. అభివద్ధి ఎంత ముఖ్యమో అవినీతి రహిత పాలన కూడా కూడా అంతే ముఖ్యమన్నారు. నియోజకవర్గాన్ని అభివద్ధి చేసేందుకు ఆయా శాఖల జిల్లా అధికారులు తగిన సహకారాన్ని స్థానిక ఎమ్మెల్యేకు అందించాలన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ మడకశిర మార్కెట్‌ యార్డులో పన్నులు వసూలు చేయడం లేదని, వెంటనే పన్ను వసూలు చేయాలన్నారు. అమరాపురం సబ్‌ మార్కెట్‌ కోసం పనులు మొదలుపెట్టి ఏర్పాటు చేయాలన్నారు. మడకశిర నూతనంగా నిర్మించిన టూరిజం భవనాన్ని వెంటనే అధికారులకు హ్యాండెవర్‌ చేసేలా చూడాలన్నారు. మడకశిర ఆస్పత్రిలో మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వీటితో మరిన్న సమస్యలను ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ రమణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌.చేతన్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఓ కొండయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.