న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కార్మికుల వేతనాల రేటులో గణనీయమైన పెరుగుదల ఉండాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ అభివృద్ధి మాజీ కార్యదర్శి అమర్జీత్ సిన్హా నేతృత్వం వహించారు. ఈ కమిటీ శుక్రవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ పెరుగుదల గణనీయంగా మరియు ఇటీవల వార్షిక పెంపు కన్నా అధికంగా ఉండాలని పేర్కొంది. ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా మార్చడంతో పాటు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా పెరగాలని స్పష్టం చేసింది. అయితే ఎంత పరిమాణంలో వేతనాల పెంపు ఉండాలన్నది కమిటీ సిఫారసు చేయలేదని, ఈ సిఫారసు మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఇచ్చే వేతనాలు వ్యవసాయ/ గ్రామీణ వేతనాలకు బెంచ్ మార్క్‌గా పనిచేస్తాయని, అలాగే పారిశ్రామిక వేతనాలపై కూడా ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది. అధిక వేతనాలు గ్రామీణ వినియోగాన్ని కూడా పెంచుతాయని తెలిపింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ వేతనాల రేటులో గణనీయమైన పెంపుతో వ్యవసాయ కార్మికుల వేతనాలు పెరుగతాయని, దీంతో వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలను రాబట్టేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకి బడ్జెట్ కేటాయింపులు భారీగా తగ్గాయి. మోడీ ప్రభుత్వం కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై) 23 కోసం సవరించిన అంచనా రూ. 89,400 కోట్లు ఉన్నప్పటికీ, బడ్జెట్ అంచనా కేవలం రూ. 73,000గా ఉంది. బడ్జెట్ కేటాయింపులు రూ.60,000 మొదటి త్రైమాసికంలోనే వినియోగించినట్లు మీడియా తెలిపింది. దీంతో ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపుల పెంపు అత్యసవరమని స్పష్టం చేసింది.










