Sep 04,2021 13:38

అమరావతి : గూగుల్‌లో ఏదైనా సమాచారం కావాలంటే.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో మెనూ ఐకాన్‌ లేదా ఫోన్‌ చివరన మధ్యలో ట్యాప్‌ చేసి 'హేరు గూగుల్‌' లేదా 'ఓకే గూగుల్‌' అంటాం. మనమిచ్చిన వాయిస్‌ కమాండ్‌ ఆధారంగా గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ సమాచారాన్ని ఇస్తుంది. ఇంతకంటే సులభతరమైన పద్ధతిని గూగుల్‌ 'క్విక్‌ ఫ్రేజెస్‌' పేరుతో గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. అంటే... ఇకపై 'హేరు గూగుల్‌' లేదా 'ఓకే గూగుల్‌' అనాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్‌గా మీరు కమాండ్‌ ఇస్తే చాలు.. వెంటనే సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఎలా అంటారా ?
    ఉదాహరణకు... మీరు అలారం సెట్‌ చేయాలి అనుకున్నారు. అందుకోసం 'సెట్‌ ది అలారమ్‌' అంటే సరిపోతుంది. గతంలో అయితే 'సెట్‌ ది అలారమ్‌'కి ముందు 'హేరు గూగుల్‌' అని తప్పక చెప్పాల్సి వచ్చేది. ఇకమీదట ఆ అవసరం లేదు. 'వాట్‌ ఈజ్‌ టైం నౌ', 'కాల్‌ హోం', 'వెదర్‌ అప్‌డేట్‌' వంటి కమాండ్‌లు డైరెక్టుగా ఇచ్చేయ్యొచ్చన్నమాట ! ఇవేకాదండోయ్.. మరిన్ని సులువైన కమాండ్‌లను గూగుల్‌ క్విక్‌ ఫ్రేజెస్‌లో చేర్చనుంది. దీంతో యూజర్స్‌ సునాయాసంగా వాయిస్‌ అసిస్టెంట్‌ సేవలను వాడుకోవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గ మార్పులను గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం బయటికి వచ్చినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు.