Oct 02,2023 12:21

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌ తదుపరి లెప్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ ముఖ్యమంత్రి గులామ్‌ నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. గతేడాది కాంగ్రెస్‌ నుండి విడిపోయిన ఆయన డెమోక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డిపిఎపి) పార్టీని ప్రారంభించారు.  ఆదివారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో  ఆయన మాట్లాడుతూ.. తాను ఉపాధి కోసం చూడటం లేదని, కాశ్మీర్‌ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని అన్నారు. జమ్ముకాశ్మీర్‌ తదుపరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గులామ్‌ నబీ ఆజాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను కొట్టిపారేస్తూ.. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవిపై తనకు ఆసక్తి లేదని అన్నారు. తాను పునరావాసం కోసం చూస్తున్నానన్న అభిప్రాయాన్ని కొందరు కల్పించేందుకు యత్నిస్తున్నారని అన్నారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం జమ్ముకాశ్మీర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలని అన్నారు. ఈ రాష్ట్రంలోని పర్యాటక అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా వాటిని పరిష్కరించాలనుకుంటున్నానని అన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని, ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఉద్యోగాలు కల్పించడం లేదని అన్నారు. చదువుకున్న యువత అవకాశాల కోసం చూస్తున్నారని, తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాలను యువత చదువు కోసం ఖర్చు చేశారని అన్నారు. టులిప్‌ గార్డెన్‌ (2007లో ఏర్పాటు చేసినది) వేలాది మందికి జీవనోపాధిని అందించిందని, జమ్ముకాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో పది నుండి 12 పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రిగా తను ప్రణాళిక రూపొందించానని చెప్పుకొచ్చారు.

ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఎ లను రద్దు చేయడం బిజెపి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు అని అన్నారు. చాలా ఏళ్లుగా కొన్ని రాజకీయ తప్పిదాలు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి బదులుగా వెనక్కి నెట్టాయని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 ఎలను రద్దు చేసి అతిపెద్ద తప్పు చేసిందని ధ్వజమెత్తారు.