Aug 29,2023 21:14

గిడుగు రామ్మూర్తి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేస్తున్న డిఆర్‌ఒ వెంకట్రావు

ప్రజాశక్తి - పార్వతీపురం : తెలుగు భాషా దినోత్సవం జిల్లాలో ఘనంగా జరిగింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్ర పటానికి డిఆర్‌ఒ జె.వెంకటరావు, జిల్లా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్ప మాలాలంకరణ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాశాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథపరిష్కర్త, శాసనపరిష్కర్త , పత్రికా రచయిత, ప్రజాస్వామ్యవాది, మానవతావాది గిడుగు వేంకట రామమూర్తి పంతులని కొనియాడారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోనికి తీసుకొచ్చిన మహనీయుడు అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని ప్రశంసించారు. కేవలం భాషాఉద్యమానికే పరిమితం కాకుండా, పర్లాఖిమిడి దగ్గర కొండ ప్రాంతంలో నివసించే ''సవరల'' కోసం తను సవరభాష నేర్చుకొని, వాచకాలు రాసి, నిఘంటువును తయారు చేసి, తన సొంత ధనంతో బడులు పెట్టించి 30ఏళ్లు వారికి విద్యాభోదన చేశారని వివరించారు. గిడుగు భాషా ఉద్యమానికి గొడుగు పట్టిన గొప్పవ్యక్తి గురజాడ అని, వీరి బంధం అపూర్వం, అనిర్వచనీయమని చెప్పారు. మాతృ భాష మానవ మనుగడకు కీలకం అన్నారు. మాతృ భాషను విస్మరించరాదని, మాతృ భాష అంటే అమ్మ భాష అన్నారు. మాతృ భాష విస్తతిని కొనసాగిద్దామని, అందుకు ఇంటిలో తెలుగు భాషను మాట్లాడుతూ ఇంటి నుండి ప్రగతి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్‌, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం.డి.నాయక్‌, టిపిఎంయు ఎపిడి వై.సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగు అధికారి ఎల్‌. అశోక్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కార్యాలయ పాలన అధికారి ఆర్‌. ఉమామహేశ్వర రావు, పర్యవేక్షకులు శ్రీరామ మూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : స్థానిక ఐటిడిఎలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి ఎపిఒ రోసిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా జాతీయ క్రీడా దినోత్సవంను కూడా ఘనంగా నిర్వహించారు. మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పిఎఒ హరికష్ణ, డిప్యుటీ ఎస్‌ఒ అప్పారావు, స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ జాకబ్‌ దయానంద్‌, జిసిడిఒ రాములమ్మ, సిఎంఒ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రభాకర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు వైస్‌ ప్రిన్సిపాల్‌, సిబ్బంది బహుమతులు ప్రధాన చేశారు.
గుమ్మలక్ష్మీపురం: స్థానికప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా వారోత్సవాల ముగింపులో భాగంగా తెలుగు శాఖ నిర్వహించిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని, కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి. శ్రీ వరం అధ్యక్షతన పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో తెలుగు భాష వారోత్సవాలు ఈనెల 23 నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. అందులో విజేతలకు బహుమతి ప్రధానోత్సవాన్ని అందజేశామన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రామయ్య, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మండల పరిషత్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గిడుగు రామ్మూర్తి వేషధారణ వేసి తెలుగు ప్రాచుర్యం, ప్రాముఖ్యతపై విద్యార్థులకు హెచ్‌ఎం పాలక దేవానంద్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహౌ ఉపాధ్యాయులు జె.సుబ్బారావు ఉన్నారు. అలాగే స్థానిక పాఠశాల ప్రిన్సిపల్‌ సిహెచ్‌. శ్రీరంజని తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనం, దాని ఆవశ్యకతను వివరించారు. అలాగే నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వివిధ పోటీలను, క్రీడలను నిర్వహించి బహుమతులను అందజేశారు. తెలుగు భాష గొప్పతనాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వివిధ రూపాల్లో నృత్య ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని నిడగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.శివున్నాయుడు మాట్లాడుతూ తెలుగు భాషను రక్షించుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : స్థానిక ప్రభుత్వజూనియర్‌ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ జంజేటి రామారావు ముందుగా తెలుగుతల్లితో కూడిన గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలతో వేశారు. అనంతరం వ్యవహారిక తెలుగుభాషా పితామహుని గురించి, తెలుగుభాషా గొప్పతనంగురించి కొనియాడారు. సమావేశంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని కృష్ణపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎఎంసి మాజీ చైర్మన్‌ రెడ్డి శ్రీనివాసరావు తన కార్యాలయంలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం భాషా సేవ గురించి ఆయన కృషి చేసిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
బలిజిపేట : వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి, జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతి వేడుకలను స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎంఇఒ సామల సింహాచలం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఎంఇఒ, హెచ్‌ఎం జయప్రసాద్‌ గిడుగు, ధ్యాన్‌ చంద్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన భువన విజయం నాటకం, సాంస్కతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకొండ: స్థానిక శాఖా గ్రంథాలయంలో తెలుగు వాడుక భాషోద్యమ పితమహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయల సంస్థ కార్యదర్శి బుర్రి కుమారరాజు పూలమాల వేసి నివాళులు అర్పిపించారు. ఆయన గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు పదాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషల్లో ఉన్న అందాన్ని వీలును తెలిపిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఆఫీస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ కోరాడ చిరంజీవి మరియు ఇంఛార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు, పాఠకులు భాస్కరరావు, మధుసూదనరావు సహయకుడు ఈశ్వర్‌ పాల్గొన్నారు. పట్టణంలోనివెంకంపేట వీధి ఎంపీయూపీ పాఠశాలలో హెచ్‌ఎం జి.పరాంకుశంనాయుడు తెలుగు భాషా దినోత్సవం,జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన ,వక్తత్వ ,చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గిడుగు రామ్మూర్తి, ధ్యాన్‌ చంద్‌ గురించి విద్యార్థులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని సి హెచ్‌ కమల కుమారిని సన్మానించారు.
భామిని : స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ రఘుపాత్రుని శివకుమార్‌ ఆధ్వర్యంలో క్రీడ, బాషా దినోత్సవాలును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులు క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం వచ్చేలా అక్షర మాలలో కూర్చొని చూపించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసరావు,వ్యాయమ ఉపాధ్యాయులు జి. శివరాం, ఉపాధ్యాయ సిబ్బంది వున్నారు.
గరుగుబిల్లి: మండలంలోని కొంకడివరం మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు వేంకట రామమూర్తి చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పక్కి రవీంద్రనాథ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని తెలుగు భాష దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని చిదిమి ఎంపియుపి పాఠశాలలో ఉపాధ్యాయులంతా సంప్రదాయ వస్త్రాలతో తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి ప్రాచీన కవులు వేషధారణ ధరించారు. జానపద కళ అయినా విద్యార్థులు తప్పిడుగులతో ప్రదర్శన నిర్వహించారు. తెలుగు భాష గురించి నినాదాలతో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల శ్రీహరినాయుడు, తెలుగు ఉపాధ్యాయుల సంతోష్‌ కుమార్‌ స్వామి, హిమాం ప్రభావతి, శకుంతల ,తదితరలు తమ అమూల్య సందేశాన్ని విద్యార్థులకు అందజేశారు.
పార్వతీపురం రూరల్‌ : సవర భాష అభివద్ధికి ఆ రోజుల్లో గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కషి దేశ యావత్తూ తెలుగు భాష గురించి ఆలోచింప చేసిందని తెలుగు ఉపాధ్యాయులు పి దుర్గాప్రసాద్‌ అన్నారు. మంగళవారం స్థానిక వేదాంత జూనియర్‌ కళాశాల ఆవరణలో స్నేహకళా సాహితీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన వ్యక్తగా ఆయన మాట్లాడారు. తెలుగు భాషా దినోత్సవానికి మూలకారకుడైన గిడుగు రామ్మూర్తి పంతులు జీవిత విశేషా లను వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది. శ్రీకాకుళం జవహర్‌ నవోదయ విద్యాలయం మాజీ తెలుగు బోధకులు జి.చిన్నమనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్వతీపురానికి చెందిన ప్రముఖ కవులు రచయితలు గంటేడ గౌరినాయుడు, మల్లిపురం జగదీష్‌, పక్కి రవీంద్రనాథ్‌, చందనపల్లి గోపాలరావు, చుక్క పారినాయుడు, ఎంవిఆర్‌ శర్మ, నాగు కాకిముక్కల, దొడ్లంకి గణపతి రావు, శ్రీవాణి ఆర్ట్స్‌ పిజె నాయుడు తదితరులు పాల్గొన్నారు.