ప్రజాశక్తి - కౌతాళం
స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి, భారతరత్న సర్దార్ వల్లభారు పటేల్ 148వ జయంతిని ఐక్యత దినోత్సవంగా మంగళవారం స్థానిక ప్రతిభ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల సెక్రటరీ సయ్యద్ మైనుద్దీన్, కరస్పాండెంట్ సయ్యద్ దూద్ బాష, ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరి మాట్లాడారు. దేశభక్తి, ధైర్య సాహసాలను, దేశానికి ఆయన చేసిన సేవలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. అంతటి గొప్ప ఆదర్శ మూర్తుల అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగి ఉండాలని, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన రంగంలోనూ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ఉన్నతంగా ఎదిగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల పర్యవేక్షకులు రాజు, జయలక్ష్మి, ఉపాధ్యాయులు రామలక్ష్మి, పరమేష్, శిరీష, ముంతాజ్, సునీల్, శ్రీను పాల్గొన్నారు. ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ మురళీ మోహన్ రెడ్డి అధ్యక్షతన సర్దార్ వల్లభారు పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపల్ సురేష్, అధ్యాపకులు అయ్యప్ప, యుగంధర్ రెడ్డి, జోనాథన్, వెంకట్రామి రెడ్డి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హోళగుంద మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దార్ వల్లభారు పటేల్ జయంతి వేడులు నిర్వహించారు. తహశీల్దార్ హుస్సేన్ సాబ్, ఎంఇఒ సత్యనారాయణ, ఇఒఆర్‌డి చంద్రమౌళీశ్వర గౌడ్, సిఆర్‌పిలు రేణుక, తుకారాం, పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న సిబ్బంది










