ప్రజాశక్తి - భీమడోలు
సీనియర్ సిటిజన్ల అనుభవాలను అన్వయించుకొని, వారి సూచనలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చునని గుండుగొలను గ్రామపంచాయతీ కార్యదర్శి వి.మురళీకృష్ణ తెలిపారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వంద సంవత్సరాల వయసుకు చేరుకుంటున్న దాట్ల నరేంద్రరాజు దంపతులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పాలకవర్గం సహాయ సహకారాలతో అర్హులైన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ప్రభుత్వ పరంగా కేటాయించిన పలు పథకాల అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా గ్రామ పరిధిలో 900 వరకు వృద్ధాప్య పింఛన్లను అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండుగొలను గ్రామ రెవెన్యూ అధికారి కె.శంకర్ పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : తహశీల్దార్ పాశం నాగమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధ ఓటర్స్‌ను ఆదివారం సన్మానించారు. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.










