May 02,2023 09:49

మేడే సందర్భంగా ధర్మవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులు

            పుట్టపర్తి అర్బన్‌ : సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని కార్మికులు నినదించారు. మేడే సందర్భంగా సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని నినదించారు. ఐక్య పోరాటలతో కార్మిక వ్యతిరేక పాలకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
హక్కుల సాధనకు పోరాటాలే మార్గం
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలే మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో సిపిఎం, సిఐటియు, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఎం, సిఐటియు జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ చికాగో నగరంలో 8 గంటల పని కోసం సాగించిన పోరాటంలో అసవులుబాసిన అమరవీరుల త్యాగానికి గుర్తుగా మేడే వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోరాటాలు చేసి సాధించుకోన్న 49 కార్మిక చట్టాలను నేడు కేంద్రం కుదించి 4 కోడ్‌లగా విభజించి కార్మికుల కడుపుకొట్టాలని చూస్తోందన్నారు. రైతాంగ హక్కుల కోసం ఢిల్లీలో రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకోవాలన్నారు. కార్మికులు పెట్టుబడిదారులకు మధ్య నిరంతర పోరాటాలు తప్పవన్నారు. పెట్టుబడిదారులకు లక్ష కోట్లు సబ్సిడీ రాయితీలు ఇస్తున్న కేంద్రం కార్మికుల హక్కులను కాల రాయాలని చూస్తోందన్నారు. పోరాటాల ద్వారానే మున్సిపల్‌ కార్మికులు తమ హక్కులు సాధించుకుంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమి ఉందని వాటిని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు రామకష్ణ, పైపల్లి గంగాధర్‌, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు నరసింహులు, పెద్దన్న, రామయ్య, గోవిందు, నరసింహులు, సాయి తదితరులు పాల్గొన్నారు.