ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లతో పాటు మండలంలోని పెద్దమరివీడు ఎంపియుపి పాఠశాలలో మాతృ భాష దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోనెగండ్లలోని జీనియస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు వివిధ వేషధారణలతో మాతృ భాష ప్రాముఖ్యతను వివరిస్తూ ఫ్లకార్డులు చేతబట్టి పాఠశాల నుంచి గంజిహళ్లి రోడ్డు వైఎస్‌ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ముల్లా జైబా, ఎఒ శ్రీనివాసులు మాట్లాడారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష ప్రాముఖ్యత గొప్పదనం అందరికీ తెలియజేయాలని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. పెద్దమరివీడులో ఎంపియుపి పాఠశాలలో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు రామలింగం, తెలుగు ఉపాధ్యాయులు పెద్ద ఖాజా, సీనియర్ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేవనకొండలోని బివిఆర్ పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. పిల్లలకు క్రీడలతో (హాకీ), రంగు రంగులతో రాసిన తెలుగు అక్షరాల ఆటలను ఆడించారు. ప్రధానోపాధ్యాయులు సుభాన్, ఉపాధ్యాయులు హరీష్, వినరు, మనోహర్, సఫరా, మౌనిక, అనసూయ, రాజేశ్వరి, నందిని, జరీనా పాల్గొన్నారు. మంత్రాలయంలోని శ్రీవైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో జాతీయ తెలుగు భాష, క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఎస్‌ఐ వేణు గోపాల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల వ్యవస్థాపకులు ఎస్‌ఐ కబడ్డీ పోటీల్లో పాల్గొని కబడ్డీ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గురజాల గంగాధర్ రెడ్డి, పాఠశాల ఎఒ ఎస్.రాఘవేంద్ర, సతీష్ చంద్ర, ప్రిన్సిపల్ అశ్విని, పాఠశాల బృందం సి.రవి, షేక్ యూనస్, ఉపాధ్యాయులు ఆదిబసవన్న గౌడ్, మల్లికార్జున, రాజేష్, ఈరన్న పాల్గొన్నారు.










