Sep 21,2023 21:30

ప్రజాశక్తి - ఏలూరు
          గురజాడ అప్పారావు జయంత్యుత్సవం ఏలూరులోని ఇండోర్‌ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, మానవత, మాతృదేవోభవ సేవా ట్రస్ట్‌, డిఆర్‌డిఎ, సెట్‌ వెల్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోరు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న గీతాలతో ఏలూరు నగరంలోని వేద పాఠశాల, కళాశాల విద్యార్థులు అందరినీ ఉత్తేజపరిచారు. ఉదయం తొమ్మిది గంటలకే ఏలూరులోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పెద్దఎత్తున ఇండోర్‌ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ డాక్టర్‌ రావి గోపాలకృష్ణయ్య 'దేశమును ప్రేమించుమన్న' ప్లకార్డును ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. గురజాడ భారీ చిత్రపటంతో గురజాడ అప్పారావు వేషధారణతో పలువురు విద్యార్థులు ముందుకుసాగారు. వారివెంట భారీసంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరారు. ఈ ప్రదర్శన స్టేడియం నుండి మెయిన్‌ రోడ్డు, ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌, డిఇఒ కార్యాలయం, రిజిస్ట్రార్‌ ఆఫీస్‌, జిల్లా గ్రంథాలయం మీదుగా తిరిగి ఇండోర్‌ స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అక్కడ దేశభక్తి గేయాలను సామూహికంగా ఆలపించారు. వారంరోజులుగా ఉత్సవ కమిటీ 50 హైస్కూళ్లు, 17 కళాశాలల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతీ విద్యాలయంలో గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని గురజాడ చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించాలని, దేశమును ప్రేమించుమన్న గేయంలో ఆరు చరణాలు పాడించే కార్యక్రమం విద్యాలయాల్లో పెద్దఎత్తున నిర్వహించారు. అనంతరం 25 పాఠశాలలు, ఐదు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందించిన బ్యాన్లు, యూనిఫారాలతో ఇండోర్‌ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి చేరుకున్నారు. తొలుత ముద్దుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి డాక్టర్‌ రావి గోపాలకృష్ణయ్య, ఏలూరు ఎంఇఒ రంగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్‌.కస్తూరిరావు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎం.సుజరు అధ్యక్షతన చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణయ్య, రంగయ్య మాట్లాడుతూ అప్పారావు జీవితాన్ని, ఆయన రచించిన దేశమును ప్రేమించుమన్న గేయాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలన్నారు. ఎల్‌బిసి స్కూల్‌ విద్యార్థులు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, ఎఆర్‌డిజికె హై స్కూల్‌ విద్యార్థులు నిర్వహించిన దేశమును ప్రేమించుమన్న గేయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం గురజాడ వేషదారులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అతిథులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి రాము సూర్యారావు, మానవత జిల్లా సమన్వయకర్త ఆలపాటి నాగేశ్వరరావు, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, ప్రయివేటు స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెసిహెచ్‌.చంద్రశేఖర్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎం.సుజరుకృష్ణ, కార్యదర్శులు అజరుబాబు, కూచిపూడి సత్యనారాయణ, వై.ఆనంద నాయుడు, పీడీ.రత్నాకర్‌రావు, టి.బుజ్జి, రమేష్‌, సోమ్లా నాయక్‌, జి.శారద, కె.శ్రావణి, ఎం.లక్ష్మి, పి.దుర్గాప్రసాద్‌, వి.సురేష్‌, వి.టాగోర్‌, కె.శ్రీనివాసరావు, పివి.నరసింహారావు, బి.మోహన్‌రావు, పి.శ్రీనివాసరావు, సిహెచ్‌.జగదీష్‌, ఎం.సాయి, సిద్దార్థ, త్రినాథ్‌, కార్యదర్శి మేతర అజరుబాబు పాల్గొన్నారు.
ఏలూరు : దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని చాటిచెప్పిన సంఘసంస్కర్త, అభ్యుదయ కవి, గురజాడ అప్పారావు అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి ఎ.రవి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లో నడుస్తుందని, నిత్యం దేశభక్తి గురించి మాట్లాడే మోడీ, నిజమైన దేశభక్తి అంటే దేశంలో ఉన్న మనుషులను పట్టించుకోవడం, వారి సమస్యలు పరిష్కరించడమేనన్నారు. అందుకే ఆ కాలంలోనే గురజాడ దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనషులోరు అని తెలియజెప్పారని గుర్తు చేశారు. ఆనాటికి ఉన్న మహిళల వివక్షపై ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. వితంతు వివాహాలను జరిపించారన్నారు. గురజాడ సమాజ అభివృద్ధికి చేసిన రచనలను, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వెలుగులోనికి తీసుకొచ్చారని తెలిపారు. ఒకపక్కన దళితులు, మహిళలు, మైనార్టీల పట్ల వివక్ష చూపుతున్న మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు దేశభక్తి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగప్రతిలో సోషలిస్ట్‌ లౌకిక పదాలను తొలగించడం రాజ్యాంగ వ్యతిరేకమని విమర్శించారు. మహిళా బిల్లు తెచ్చామంటూ గొప్పలు చెబుతున్న బిజెపి మహిళలను రెండో తరగతి పౌరులుగా చూడటాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య, ఆ పార్టీ నాయకులు ఎం.ఇస్సాక్‌, జి.రవీంద్ర, వేణుగోపాల్‌, త్రినాథ్‌ పాల్గొన్నారు
గురజాడ జీవితం ఆదర్శం : అరసం
టి.నరసాపురం:గురజాడ అప్పారావు జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శమని అభ్యుదయ రచయితల సంఘం(అరసం) రాష్ట్ర కార్యదర్శి బిఎన్‌.సాగర్‌ అన్నారు. మండలంలోని మక్కినవారిగూడెంలో హేమసాయి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్లో అరసం, హేమసాయి హైస్కూల్‌ యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో గురజాడ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పూర్ణమ్మ కథ నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజన్‌ యుపి స్కూలు విద్యార్థులు గురజాడ జీవిత విశేషాలను తమ ప్రసంగాల రూపంలో సభ ముందుంచారు. అనంతరం విజన్‌ ఇంగ్లీషు మీడియం యుపి స్కూల్‌ కరస్పాండెంట్‌ పురం శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాగర్‌ మాట్లాడుతూ గురజాడ సంఘ సంస్కర్తగా, సాహితీ సృజనకారుడుగా ఆయన సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపిపి బి.దివ్య భారతి, అర్జా ధర్మారావు, అడపా కిన్నెర, టి.జ్యోతి, కె.దిలీప్‌ కుమార్‌, పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.