Sep 22,2023 00:50

గురజాడ చిత్ర పటానికి పూలమాల వేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు,

ప్రజాశక్తి-పాడేరు
గురజాడ అప్పారావు ఆశయాలను ఆచరిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.చిన్నారావు పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 161 వ జయంతినీ పాడేరులోని లక్ష్మి ప్రసన్న జూనియర్‌ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్లేవాళ్లు, మహిళలను గౌరవించని వారు, మతాల మధ్య మంటలు పెట్టేవాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. దేశంలో నూతన విద్యా విధానం తీసుకొచ్చి విద్యను మతోన్మాద కాషాయీకరణ చేయాలని ప్రయత్నం చూస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో గల ఆశ్రమ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేసారు. ముందుగా గురజాడ చిత్రపటానికి విద్యార్థులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మత్యరాజు, సింహాద్రి, ప్రేమ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌ : మండలంలోని శారదా నికేతన్‌ స్కూల్లో గురజాడ అప్పారావు 161 వ ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు చిరంజీవి అన్నారు. గురువారం స్కూల్‌ ఆవరణలో గురుజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వాళులర్పించారు.ప్రధానోపా ధ్యాయుడు చిరంజీవి మాట్లాడుతూ. తన రచనలు ద్వారా సమాజంలో పరివర్తన తీసుకొచ్చిన మహనీయులు గురజాడ అప్పారావు అని కొనియాడారు. ఆనాటి సమాజంలో సామాజిక అసమానతల పై గురజాడ చేసిన కృషి మరవలేనిదని గుర్తుచేశారు. గురజాడ వాడుక భాష లో ఎన్నో రచనలు, ఆయన సేవలు నేటికీ మనకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.ఆయన అద్భుత రచనల్లో కన్యాశుల్కం అత్యంత ఆదరణ పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు డి,నాగలక్ష్మి, కృష్ణ కుమారి, కుమారి, విజయకుమార్‌, సంధ్య, ధనురాజన్‌రావు పాల్గొన్నారు.
చింతూరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గురజాడ వెంకట అప్పారావు జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రత్న మాణిక్యం మాట్లాడుతూ గురజాడ అప్పారావు సాహితీవేత్తగా మిగిలిపోలేదని, గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని తెలిపారు. తెలుగు భాష ఉన్నంత వరకు గురజాడ జీవించి ఉంటారన్నారు. ఆధునిక మహిళకు నిర్వచనం చెప్పిన వ్యక్తి గురజాడ అని పేర్కొన్నారు. తెలుగు విభాగాధిపతి కె.శ్రీదేవి, మాట్లాడుతూ తన రచనల ద్వారా సామాజిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎమ్‌.శేఖర్‌, అధ్యాపకులు జి.వెంకట్రావు, కె.శకుంతల, జి.హారతి, ఎస్‌.అప్పనమ్మ, కె.శైలజ, సిహెచ్‌.రాజబాబు, కె.శ్రీలక్ష్మి, ఆర్‌.మౌనిక, పి.గౌతమి, జి.సాయికుమార్‌, పి.ఏడుకొండలు, పి.అలివేలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొయ్యూరు : స్థానిక ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో గురజాడ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ హరున్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురజాడ సాంఘిక దురాచాలపై తన కలాన్ని ఎక్కుపెట్టారన్నారు. గురజాడ దేశభక్తి గేయం ఎల్లలు లేని విశ్వమానవ ప్రేమను చాటే మహోన్నత గేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణ, శ్రీనివాస్‌, రాజబాబు, సౌమిత్ర, రమణమ్మ, లవరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.