Jun 04,2023 22:08

ఏరువాక సంబరాల్లో రైతు సంఘం నాయకులు

ఘనంగా ఏరువాక పౌర్ణమి
అరక పట్టిన రైతు సంఘం నాయకులు
ప్రజాశక్తి - నంద్యాల

      నంద్యాల మండలం చాబోలు గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఘనంగా నిర్వహించారు. పొలంలో రైతు సంఘం నాయకులు అరక పట్టి దుక్కి దున్నారు. అలాగే రైతులు తమ ఎద్దులను అలంకరించి అరకబట్టి దున్ని సేద్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌ మాట్లడుతూ అనేక సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కలిసికట్టుగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తమ వృషభాలను రంగులతో అలంకరించుకొని పొలాల్లో సేద్యాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. నైరుతి రుతుపవనాల వల్ల మంచి వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ప్రకృతిని కోరారు. ప్రకృతితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం అభివృద్ధికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు సకాలంలో అందించి, పంటలు కల్లాల్లోకి రాకముందే మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో రైతులందరూ రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి అవసరమైన అన్ని రకాల హక్కులను సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడాలని, అందుకు రైతు సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు వి.సుబ్బరాయుడు, జిల్లా నాయకులు ప్రసాద్‌, చాబోలు నాయకులు వెంకట లింగమయ, డి.బాల హుస్సేన్‌, నాయుడు, మురళి, మాజీ ఎంపిటిసి చిన్న బాల హుస్సేన్‌, రైతులు పాల్గొన్నారు. నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంలో అరక పట్టారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాల వలన రైతులపై ఎక్కడలేని బారాలు మోపుతున్నారని అన్నారు. రైతులకు సబ్సిడీ రుణాలు అందించడంలో, సున్నా వడ్డీ పథకం వర్తించడంలో ప్రచార ఆర్భాటం తప్ప అమలు శూన్యమన్నారు. సబ్సిడీపై విత్తనాలను, ఎరువులను, క్రిమిసంహారిక మందులను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వి.రామకృష్ణ, మండల నాయకులు ఎం హరి నాయుడు, వి.ఏసన్న, వడ్డే శివమణి, ప్రసాద్‌, జంగాల సుంకన్న, భాష, సిఐటియు మండల నాయకులు టి నరసింహులు, జి రాము, శివ తదితరులు పాల్గొన్నారు.