కదిరి టౌన్ : ప్రకృతి మానవాళికి అంతులేని సంపదలను సమకూర్చి పెట్టింది. అందులో ప్రధానమైనవి అటవి, ఖనిజ సంపద. ఈ రెండు శాఖల అనుసంధానంతో ప్రజలు ప్రభుత్వానికి ఆదాయ వనరు సమకూరుస్తోంది. అటవీ శాఖ పరిధిలోని భూగర్భ గనులు కొన్ని చోట్ల ఉండగా మరికొన్నిచోట్ల మైన్స్ అండ్ జియాలజీ ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో భూగర్భ గనుల శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధికార వైసిపి ప్రభుత్వం ఈ శాఖను ప్రయివేటు పరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాక కొత్త విధానానికి తెరలేపింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖపై ప్రత్యేక దష్టి సారించి ఆ శాఖ పరిధిలోని ఖనిజ సంపద ఇతర మినరల్స్ వంటి వాటిపై అన్ని హక్కులను ప్రయివేటు పరం చేసే విధంగా టెండర్లు పిలిచి అమిగోస్ మినరల్స్ అనే సంస్థకు వాటిని లీజుకు కేటాయించినట్లు సమాచారం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూగర్భ గనుల ఖనిజ సంపద మినరల్స్ వంటి వాటిపై రూ 10.80 కోట్లకు కేటాయించినట్లు సమాచారం. ఉమ్మడి అనంత జిల్లాలో అత్యధిక శాతం సంపద ఎక్కడ ఉందో అక్కడ ఆ సంస్థ తరఫున తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలను కొనసాగిస్తుండడం గమనార్హం. ఎంతో హంగు ఆర్భాటాలతో తనిఖీ కేంద్రాలను జిల్లాలో కొన్ని చోట్ల ఏర్పాటుచేయగా మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. భూగర్భగనులు ఖనిజ సంపదలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయా ప్రజా ప్రతినిధుల కనుసనల్లోనే ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కదిరి, పెనుగొండ, రాప్తాడు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, తాడిపత్రి, మడకశిర, ధర్మవరం నియోజకవర్గంలో అత్యధికంగా భూగర్భ గనుల వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొండగుట్టలు ఇతర భౌగోళిక వనరులపై ఆధారపడి లక్షలాది మంది పేదలు జీవనం సాగిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ బీసీ, వర్గాలకు చెందిన కుటుంబాలు భూగర్భ గనులు ఇతర సంపదను ప్రజలకు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో అధికారం పార్టీ విధించిన ఉత్తర్వులు వారి జీవన విధానానికి శాపంగా మారిందనీ పలువురు మేధావులు, పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్ధేశించిన ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్, ఆర్డీవో పరిధిలో లీజ్ ఏర్పడిన రాయల్టీ చెల్లించి తమ జీవన విధానాన్ని వత్తిని కొనసాగించేవారు. ప్రస్తుతం అధికార ప్రభుత్వం గనుల శాఖను ప్రయివేటుకు దారాధత్తం చేయడంతో పేద కుటుంబాలు దిక్కుతోచక అల్లాడుతున్నాయి. నూతన పాలసీ విధానం అమలు చేయడంతో అమిగొస్ సంస్థ ఆంక్షలు పెడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తంచేశారు. భూగర్భ గనులు శాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాలు ఇబ్బుడి ముబ్బుడిగా దర్శనమిస్తుండగా మరికొన్నిచోట్ల ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఒకవైపు నూతన లీనరీస్ పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయం కోట్లలో వస్తుందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. మిగిలిన అనధికారకంగా వస్తున్న ఆదాయం ఎవరి జోబులోకి వెళ్తున్నది ఆ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూగర్భ మైన్స్‌అండ్ జియాలజి శాఖ సంబంధించి తనిఖీ కేంద్రాలు ఎక్కడెక్కడ పెట్టారో.? ఎన్ని ఉన్నాయో.? ఎవరి పర్యవేక్షణలో నడుస్తున్నాయి.? అన్నది తెలియకుండా గోప్యత ప్రదర్శించడం వెనుక మతలబు ఏమిటో గనుల శాఖ అధికారులకు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కొండగుట్టలో ఖనిజ సంపదను తీసుకెళ్లడానికి సంబంధిత కాంట్రాక్టర్ లీజు విధానంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి అనుమతులు పొందుతారు. మరికొంతమంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ భవనాలు ఇతర రోడ్లు పనులు అభివద్ధి పనుల చేస్తున్న సమయంలో తాము చేసిన పనులకు సంబంధించి అంతకుముందే టెండర్ వేసేటప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి ఎంబుక్ సైతం రికార్డు చేసి అనుమతులు పొందుతుంటారు. వాస్తవానికి ప్రభుత్వ పనులకు నాడు-నేడు రోడ్లు వంటి పనులకు రాయల్టీ లేదు. అందుకు విరుద్ధంగా తప్పనిసరిగా రాయల్టీ చెల్లించే విధంగా అనధికార విధివిధానాలను అమలు చేస్తూ భారీ స్థాయిలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆ వర్గాల నుంచి విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీంతోపాటు రాళ్లను కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వారితో కూడా డబ్బులు వసూలు చేస్తూ అనుమతులు తప్పనిసరి చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భ గనుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాల్సిన తనిఖీలు ప్రయివేటు సంస్థతో చేతులు కలిపి వారి వాహనాలులో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రవేటు సంస్థ కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయకపోవడం ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.










