Jul 18,2023 09:44

లేపాక్షి మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల

          లేపాక్షి : లేపాక్షి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఆదివారం సాయంత్రం సిబ్బంది ఎవరికీ చెప్పకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం అయినా ఈ విద్యార్థి పాఠశాలలో లేడన్న విషయాన్ని సంబంధిత గురుకులం పాఠశాల అధికారులు, సిబ్బంది గుర్తించలేదు. ఈ ఘటన గురుకులంలో చదివే పాఠశాల విద్యార్థుల సంరక్షణ పట్ల ఎలాంటి నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారన్నది అద్దం పడుతోంది. ముదిగుబ్బ మండలం నాగులబావి గ్రామానికి చెందిన షామీర్‌ కుమారుడు షాజహాన్‌ లేపాక్షి మహాత్మా జ్యోతిబా గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఆదివారం సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి కాలినడకన అతని గ్రామానికి బయళ్దేరాడు. మార్గమధ్యంలో చీకటి పడటంతో దిక్కుతోచక ఎక్కడికీ పోలేని పరిస్థితిలో చిలమత్తూరు మండలం అటవీ ప్రాంతంలోని కనుమ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద నిద్రించాడు. ఎక్కడికి పోవాలో తెలియక సోమవారం ఉదయం బాలుడు ఎడుస్తూ అక్కడే కూర్చొన్నాడు. అటుగా వెళ్లిన ఓ ప్రయివేటు పాఠశాల బస్సు డ్రైవర్‌ బాలున్ని గుర్తించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు విద్యార్థినితో మాట్లాడగా తన చిరునామా చెప్పాడు. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలున్ని వారికి అప్పగించారు. కాగా దాదాపు 20 గంటల పాటు బాలుడు కనబడుకున్నా లేపాక్షి గురుకులం ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. తల్లిదండ్రులు వారి పిల్లలను చూడడానికి వెళ్తే లోపలికి కూడా అనుమతించని గురుకులం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఇలా ఓ పిల్లాడు పాఠశాల నుంచి బయటకు వెళ్లినా గుర్తించకుండా ఏమి చేస్తున్నారంటూ పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.