Feb 06,2022 12:49

'నేను శైలజ' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు నటి కీర్తి సురేశ్‌. తొలి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన 'మహానటి'తో కీర్తి సురేశ్‌ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఒకపక్క స్టార్‌ హీరోలతో నటిస్తూనే.. మరో పక్క లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ మెప్పించారు. తాజాగా స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన 'గుడ్‌ లక్‌ సఖి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!

 

గురి తప్పిన 'గుడ్‌ లక్‌ సఖి'



చిత్రం : గుడ్‌లక్‌ సఖి
నటీనటులు : కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రమాప్రభ, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : చిరంతన్‌ దాస్‌
ఎడిటింగ్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాత : సుధీర్‌ చంద్ర పదిరి
బ్యానర్‌ : రాత్‌ ఎ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌
రచన, దర్శకత్వం : నాగేశ్‌ కుకునూరు
విడుదల : 28-01-2022

కథలోకి వెళ్తే.. మారుమూల పల్లెటూరిలో ఓ పేద కుటుంబానికి చెందిన ఒక సాధారణమైన యువతి సఖి (కీర్తి సురేష్‌). అయినా తనకీ ఓ టాలెంట్‌ ఉంది. చిన్నప్పటి నుండి దేనినైనా గురి చూసి కొట్టగొలదు. సఖి స్నేహితుడు గోళీ రాజు (ఆది పినిశెట్టి). చిన్నతనం నుంచే సఖి టాలెంట్‌ను గుర్తించి, ఆమెలో నమ్మకాన్ని పెంచుతాడు. ఎప్పుడూ ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఊరంతా సఖిని 'బ్యాడ్‌లక్‌ సఖి' అని అంటుంటారు. అయితే గోళీరాజు ఆమెలోని ఆ ప్రతిభను గుర్తించే.. షూటింగ్‌ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఇందుకోసం తమ ఊరికి వచ్చిన కల్నల్‌ (జగపతిబాబు) సహాయం తీసుకుంటాడు. ఆయన ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. దేశం గర్వపడేలా మంచి షూటర్స్‌ని తయారుచేయాలన్నది ఆయన కల. సఖిలోని ప్రతిభ నచ్చి, ఆమెకు షూటింగ్‌లో శిక్షణ ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ ఆటలో పైకి ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లేంటి? వాటన్నింటినీ దాటుకుని ఎలా విజయం సాధించింది? తన పేరును గుడ్‌ లక్‌ సఖిగా ఎలా మార్చుకుంది? సఖి - గోలిరాజుల ప్రేమకథ ఏమైంది? అన్నది తెరపై చూడాలి.
    తెలుగు తెరపై ఇప్పటివరకూ అనేక క్రీడా నేపథ్య చిత్రాలు మెరిసినా.. షూటింగ్‌ ఆట నేపథ్యంలో సాగే సినిమాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇప్పుడా లోటును 'గుడ్‌లక్‌ సఖి' తీర్చేసింది. నిజానికి ఇలాంటి క్రీడలను ఆధారం చేసుకుని, రసవత్తరమైన కథను సిద్ధం చేసుకోవడం ఏ దర్శకుడికైనా కత్తి మీద సామే. ఎందుకంటే ఇక్కడ కథ మొత్తం ఒక ఆటగాడి చుట్టూనే తిరుగుతుంటుంది. ఎలాంటి భావోద్వేగాలైనా, సంఘర్షణ అయినా ఆ ఒక్క పాత్ర నుంచే సమర్థంగా రాబట్టుకోవాల్సి ఉంటుంది. అదే క్రికెట్‌, హాకీ లాంటి బృంద ఆటల్లో అయితే.. తెరపై కనిపించే ప్రతి ఆటగాడి నుంచీ ఎమోషన్స్‌ పిండుకోవచ్చు. అవన్నీ ప్రేక్షకుల్ని కథలో లీనం చేయడంలో ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. అయితే 'గుడ్‌లక్‌ సఖి' విషయంలో ఈ అల్లిక సరిగ్గా కుదర్లేదు.
     సినిమా ఆరంభం నుంచే సఖి పాత్రకు సరైన లక్ష్యం ఉందా? అన్న అనుమానం ప్రేక్షకుల్ని వెంటాడుతుంటుంది. ఊరంతా ఆమెని బ్యాడ్‌లక్‌ సఖి అంటుంటే.. ఆ పేరును మార్చాలన్న ఆశయం గోలిరాజు పాత్రలో కనిపిస్తుందే తప్ప, సఖి పాత్రలో కనిపించదు. పల్లెటూరిలోని యువతను దేశం గర్వించే షూటర్స్‌గా తయారుచేయాలన్న కల్నల్‌ లక్ష్యం వెనకున్న కారణమేంటో ఎక్కడా చూపించలేదు. ఆరంభంలో కీర్తి పరిచయ సన్నివేశాలు ఎంత సాదాసీదాగా ఉంటాయో.. ముగింపు వరకూ సినిమా అదే టెంపోలో సాగుతుంటుంది. ప్రథమార్ధం మధ్యలో సఖి, గోలిరాజు ప్రేమకథ కాస్త కాలక్షేపాన్నిస్తుంది. కల్నల్‌ పాత్ర ఎంట్రీ తర్వాతే కథలో వేగం పెరుగుతుంది. సఖిని షూటర్‌గా మార్చే క్రమంలో కల్నల్‌ చేసే ప్రయత్నాలన్నీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా కథ గురి తప్పినట్లు అనిపించినా కుటుంబం మొత్తం వారాంతంలో చూడదగిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి'.
    బంజారా యువతిగా సఖి పాత్రలో కీర్తి సురేష్‌ చక్కగా ఒదిగిపోయారు. ఆ యాసలో ఆమె పలికిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ప్రథమార్ధంలో కొన్ని చోట్ల ఆదితో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే ద్వితీయార్ధంలో జగపతిబాబుతో ఆమె పోటీపడి నటించింది. నాటకాలు వేసుకునే వ్యక్తిగా గోలిరాజు పాత్రలో ఆది చక్కటి నటనను కనబర్చారు. కల్నల్‌ పాత్రకు జగపతిబాబు నిండుతనం తెచ్చారు. ఆ పాత్ర సినిమాకి బలాన్నిచ్చింది. ఆరంభంలో కథను మలుపు తిప్పేలా కనిపించిన రాహుల్‌ రామకృష్ణ పాత్ర.. ఆ తర్వాత పూర్తిగా తేలిపోయింది. రఘుబాబు, రమాప్రభ తదితరులు పరిధి మేర నటించారు. నగేష్‌ కొత్త స్పోర్ట్స్‌ డ్రామాను తెలుగు తెరకు చూపించే ప్రయత్నం చేసినా.. దాన్ని ఆకట్టుకునేలా ఆవిష్కరించడంలో విఫలమయ్యారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఫర్వాలేదని పించింది. పాటలు వినసొంపుగా ఉన్నా.. మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. చిరంతన్‌ దాస్‌ ఛాయాగ్రహణం కథకు తగ్గట్లుగా చక్కగా కుదిరింది.