ప్రజాశక్తి - మంత్రాలయం
గుంతలు పడిన రోడ్లపై ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో తెలుగు రైతు, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 'మేము గొప్ప' అని చెప్పుకోవడం మానేసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాలని కోరారు. మాలపల్లి నుంచి ఎమ్మిగనూరుకు, కోసిగి నుంచి హాల్వికి, ఉరుకుంద నుంచి హాల్వికి గుంతలు పడిన రోడ్లపై ప్రయాణించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా డబ్బులు, ఉరుకుందు ఈరన్న దేవాలయం వివిధ టెండర్లలో వచ్చిన డబ్బు, చేపల చెరువుల ద్వారా వచ్చిన డబ్బు, తినలేదని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం వద్ద ప్రమాణం చేయాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. పులికనుమ ప్రాజెక్టు తాను చంద్రబాబు నాయుడితో మాట్లాడి నిధులు విడుదల చేయిచామని తెలిపారు. కౌతాళం మండలం ఎరిగేరలోనే కాదు... అనేక చోట్ల భూ దందా జరిగిందని, వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాను కూడా వ్యక్తిగత జీవితాలను బయటకు తెస్తానని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని ఆపలేరని, నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు శివబాల, రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బి.లక్ష్మన్న పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నరవ రమాకాంత్ రెడ్డి










