ప్రజాశక్తి - వీరఘట్టం : స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కమాటీగా విధులు నిర్వహిస్తున్న పొందూరు మండలం కంచరం గ్రామానికి చెందిన కంచరాం పోలరావు(61) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. వసతి గృహంలో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు 12 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కమాటీగా పోలరావు, రోజువారి కూలీగా శివ్వరి సూరి విధులు నిర్వహిస్తున్నారు. పోలరావు, సూరి వేరే గదిలో, విద్యార్థులు వేరే గదిలో పండుకుంటున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి భోజనం అనంతరం పోలరావు, సూరి, విద్యార్థులు వేరే వేరే గదిలో పడుకున్నారు. సోమవారం తెల్లవారి 7గంటలు అయినప్పటికీ పోలారావు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో విద్యార్థులు లేపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ లేవకపో వడంతో వసతి గృహానికి సమీపంలో ఉన్న స్థానికులకు, సంక్షేమ అధికారి పి ధర్మరావుకు విద్యార్థులు సమాచారం అందజేశారు. సంక్షేమ అధికారి ఉన్నత స్థాయి అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలరావు వసతి గృహంలోనే మృతి చెందడంతో విద్యార్థులు జీర్ణించుకోలేక బీతిల్లి పోతున్నారు. జిల్లా స్థాయి సంక్షేమం శాఖ అధికారి పి గోపినాథ్, వైస్ ఎంపిపి విజయ కుమారి, వసతి గృహానికి చేరుకుని విద్యార్థులకు ధైర్యం చెప్పి భోజన సదుపాయాలు కల్పించారు. మృతుడు పోలరావు 2021న బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన మృతి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వగ్రామైన కంచరం తరలించారు.
రావివలస హాస్టల్‌కు విద్యార్థులు తరలింపు
పోలరావు మృతి చెందడంతో విద్యార్థులను గరుగుబిల్లి మండలంలోని రాయవలస వసతి గృహానికి తరలిస్తున్నట్లు సంక్షేమ శాఖ అధికారి గోపీనాథ్ తెలిపారు. నాలుగైదు రోజుల వరకు వసతి గృహాన్ని మూసి వేస్తున్నామని తెలిపారు. వసతి గృహాన్ని ఐసోలేషన్ చేసేందుకు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
మచ్చలేని పోలరావు
ఏ గృహంలో పనిచేసినా మచ్చలేని ఉద్యోగిగా పోలరావు విధులు నిర్వహించారని, వచ్చే ఏడాది ఆగస్టులో పదవి వివరణ పొందాల్సిన ఆయన మరణం బాధాకరమని అధికారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆక్రోశానికి గురయ్యారు. మృతునికి భార్య లత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
నీడ కోల్పోయిన విద్యార్థులు
వసతి గృహానికి సమీపంలో ఉన్న ఎంపిపి పాఠశాల, కోమటి వీధి పాఠశాలల్లో విద్యార్థులు వసతి గృహం మూసివేతతో నిలువు నీడ కోల్పోయారు. ఈ పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనులు జరుగుతుండంతో వీరందరికీ వసతి గృహంలోనే బోధించేవారు. ఇప్పుడు ఆయన మృతితో వసతి గృహం మూసివేయడం వల్ల ఇక్కడ విద్యార్థులకు బోధించేందుకు అవకాశం లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.










