May 13,2021 22:12

మిలాన్‌ : గూగుల్‌ సంస్థకు ఇటలీ ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, యాప్‌ స్టోర్‌ గూగుల్‌ ప్లే కారణంగా అగ్ర స్థానంలో వున్న గూగుల్‌ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందంటూ 12.3కోట్ల డాలర్ల మొత్తాన్ని ఇటలీ పోటీ పర్యవేక్షణా సంస్థ జరిమానాగా విధించింది. డ్రైవింగ్‌ చేసేటపుడు గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను ఉపయోగించడానికి బదులుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో జ్యూస్‌పాస్‌ యాప్‌ను వాడేందుకు గూగుల్‌ అనుమతించడం లేదని ఇటలీ నియంత్రణా సంస్థ పేర్కొంది. రెండేళ్ళ నుండి ఆండ్రాయిడ్‌ ఆటోలో ఈ యాప్‌ను వాడేందుకు అనుమతించడం లేదు దీనివల్ల యూజర్‌ బేస్‌గా ఎదిగేందుకు ఎనెల్‌ ఎక్స్‌కు గల సామర్ధ్యం విషయంలో రాజీ పడాల్సి వస్తోందని నియంత్రణా సంస్థ పేర్కొంది. ఇటాలియన్‌ సంస్థ అయిన ఎనెల్‌లో ఇ సొల్యూషన్‌ విభాగమే ఎనెల్‌ ఎక్స్‌. కాగా, జరిమానా విధించడంతో పాటుగా ఆండ్రాయిడ్‌ ఆటోలో జ్యూస్‌ పాస్‌ కూడా వాడుకునేలా అనుమతించాల్సిందిగా గూగుల్‌ను కోరింది.