చిలమత్తూరు : ప్రతి రోజూ విదేశీ విహంగాలైన సైబీరియన్ పక్షుల కిలకిల రావాలతో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామం మేల్కొంటోంది. అన్ని గ్రామాల్లో కోడి జనాన్ని నిద్రలేపితే ఇక్కడ మాత్రం ఈ ఎర్రకాళ్ల కొంగలు గ్రామస్తులను లేపుతాయి. ఈ ఊరి అతిథిలా వచ్చే ఈ పక్షులను అక్కడి గ్రామస్తులు ఎంతో ప్రేమతో చూసుకుంటారు. వాటి కిలకిలరావాలను ఎంతో సంతోషంగా వింటూ ఉంటారు. ఇంత సంతోషంగా విహరిస్తున్న ఆ పక్షులు ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపానికి గురయ్యాయి. సోమవారం రాత్రి గాలివాన బీభత్సం దాటికి పక్షుల గూళ్లు నేలవాలాయి. రెక్కలతెగి కిందపడిన చిన్న పక్షుల ఆర్థనాదాలు ఆ గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కుప్పలు కుప్పలుగా పక్షి పిల్లల కబేలాలు మంగళవారం ఉదయం గ్రామంలో దర్శనమించాయి. వీటిని చూసిన జనం కన్నీటి పర్యంతం అయ్యారు. చెట్ల కింద ముళ్ల కంపల్లో చిక్కుకుని వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. చెట్లకు వేలాడుతూ మృతి చెందిన పిల్ల పక్షులను చూసి తల్లి పక్షులు మూగరోదన చేశాయి. ఇంతంటి కష్టానికి ప్రకతి విలయం ఎంత కారణమో వీటి రక్షణలో ప్రభుత్వం, సంబందిత శాఖల వైఫల్యం కూడా అంతలా కన్పిస్తోంది.
ఛిద్రమైన 'అతిథి' ప్రయాణం..
సైబీరియన్ పక్షులకు ఓప్రత్యేక ఉంది. ఇవి ప్రతి ఏటా పిబ్రవరిలో రష్యా నుంచి ఎల్లలు దాటి సంతానోత్పత్తి కోసం చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు వస్తాయి. ఈ ఎర్రకాళ్ల కొంగలు వాటి సంతానాన్ని ఇక్కడ చేసుకుని మళ్లీ జూలై, ఆగస్టులో పిల్లలతో కలిసి వారి దేశానికి వెళ్లిపోతాయి. ఇది దశాబ్ధాల కాలంగా కొనసాగుతోంది. సంతానోత్పత్తికి అనువైన ప్రదేశంగా భావించి వీరాపురానికి వచ్చే ఈ ఎర్రకాళ్ల కొంగలను అతిథి పక్షుల్లా భావించి గ్రామస్తులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఐదేళ్ల క్రితం వరకు ఇక్కడ నీరు, ఆహారం వసతి తగ్గడంతో పక్షుల రాక కూడా తగ్గింది. గత రెండేళ్లుగా వర్షాపాతం ఎక్కువ నమోదు కావడంతో పక్షుల సంఖ్య మళ్లీ పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండేళ్లలో పక్షులు పెద్ద సంఖ్యలో వీరాపురం గ్రామానికి వచ్చాయి. ఈ ఏడాది వీటి సంఖ్య మరింత పెరిగింది. గ్రామంలో చెట్లన్నీ ఈ పక్షుల గూళ్లతో నిండిపోయాయి. ఇటీవల ఈ పక్షులు గుడ్లు పొదిగి పిల్లల పునరుత్పత్తి జరిగింది.
చెదిరిన పక్షుల గూడు
20 నుంచి నెల రోజుల వయస్సున్న పక్షి పిల్లలు గూళ్లలో ఉన్నాయి. కాగ సోమవారం రాత్రి ఒక్కసారిగా ఈ వీరాపురం పరిసర గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పక్షుల గూళ్లు చెదిరిపోయాయి. వాటిలో ఉన్న పిల్ల పక్షులు కింద పడి మృతి చెందాయి. మరికొన్ని రక్తగాయాలతో కాళ్లు విరిగి నడవలేని స్థితికి చేరుకున్నాయి. ఎక్కడ చూసినా వందలాది పక్షుల కబేళాలు కన్పించాయి. ఏ చెట్టు కింద చూసినా కాళ్లు విరిగి కుంటుతున్న పక్షులు... రెక్కలు విరిగి ఎగరలేక అగచాట్లు పడుతున్న, మతి చెందిన పక్షులు కన్పించాయి. ఇక రెండు నెలల్లో పక్షుల సొంత దేశానికి వెళ్లే సమయంలో ప్రకృతి సృష్టించిన విలయ తాండవానికి ఆ పక్షుల జీవన రెక్కలు తెగిపోయాయి. మొత్తంగా ఎన్ని పక్షులు మరణించాయన్న దానిపై అధికారులు ఆ గ్రామంలో పర్యటించి లెక్కలు వేస్తున్నారు.
అధికారుల వైఫల్యమే కారణమా..?
జిల్లాకు వచ్చే ఈ సైబీరియన్ పక్షులను అతిథుల్లా చూసుకోవడమే కాదు.. వాటి రక్షణను అధికారులు చూసుకోవాల్సి ఉంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పక్షల రక్షణలో సంబంధిత శాఖలు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అతిథి పక్షుల ప్రాణం పోవడానికి పకతి విలయతాండవం ఎంత కారణమో... ప్రభుత్వం, సంబందిత శాఖల వైఫల్యం కూడా అంతే ఉందనే వాదన బలంగా విన్పిస్తోంది. వీరాపురం గ్రామంలో 2016లో కూడా ఇలాగే ఒకసారి జరిగింది. అప్పుడు వందలాది పక్షుల పిల్లలు మత్యువాత పడ్డాయి. కాళ్లూ రెక్కలు విరిగి నరకయాతన పడ్డాయి. ఆ తర్వాత పక్షుల రాక బాగ తగ్గింది. అప్పటి ప్రభుత్వం అధికారులు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదని పక్షులకు కత్రిమ గూళ్లు ఏర్పాటు, చెట్లు పెంపకం, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతామని ప్రగల్బాలు పలికారు. అయితే 6 ఏళ్లుగా చేసింది ఏమీ లేదు. అటు పర్యాటక శాఖ, ఇటు అటవీశాఖ, పశువైద్య శాఖలు మాటలు తప్పా ఆచరణలో సైబీరియన్ పక్షుల సంరక్షణకు తీసుకున్న చర్యలు ఏమీలేవు.
పక్షులు మరణించినా నిర్లక్ష్యమే...
సోమవారం రాత్రి ప్రకృతి ప్రకోపానికి సైబీరియన్ పక్షుల పిల్లలు వందల్లో మరణించాయి. గ్రామస్తులు పక్షుల కబేళాలను పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశారు. ఇంత పెద్ద ఘటనా జరిగినా కూడా అధికారులు మంగళవారం మధ్యాహ్నం వరకు ఆ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. 'పక్షులే కదా పోతేపోని' అనుకున్నారో ఏమీ ఏ అధికారి కూడా వీటి గురించి పెద్ద పట్టించుకోలేదు. పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉంటే కొన్ని పక్షుల ప్రాణాలైన కాపాడే పరిస్థితి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి రెగ్యులర్ పశువైద్యలు లేరు. ఇన్‌ఛార్జులు ఉన్నా వారు స్థానికంగా ఉండరు. ఎప్పుడైన ఇలాంటి ఘటన జరిగితే పరిశీలన చేసినట్లు ఫొటోలు దిగడం వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. మంగళవారం నాడు అదే జరిగింది.
విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణమా..?
పక్షుల మృతి గాలివాన బీభత్సంతో పాటు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా ఓ కారణం అయ్యి ఉండ్చోచ్చనే వాదన విన్పిస్తోంది. గాలివానకు చెట్లపై ఉన్న పక్షి పిల్లలు కింద పడ్డాయి. వీటిలో ఎక్కువ శాతం వాటికి కాళ్లు,రెక్కలు విరిగాయి. ఒక చెట్టులో మాత్రం కింద పడ్డ అన్ని పక్షి పిల్లలూ మృతి చెందాయి. ఆ చెట్టు కొమ్మల మధ్యన విద్యుత్ తీగలు వెల్లాయి. దీనికి కొంతదూరంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ నేపథ్యంలో పక్షి పిల్లల మతి వెనుక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా ఓ కారణం అయ్యి ఉండోచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక పక్షులు ఉంటున్న మహా వక్షంలో విధ్యుత్ తీగలు ఉన్నా వాటిని మార్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నం చేయలేదు. కనీసం రక్షణ కవచాలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పక్షుల మరణాలు మరింత పెరిగాయి.
పక్షులను సంరక్షించాలి
వేణు గోపాల్ రెడ్డి, పక్షుల సంరక్షకుడు,
వీరాపురం గ్రామం
సైబీరియన్ పక్షుల సంఖ్యకు అనుగుణంగా వీరాపురం, పరిసర గ్రామాల్లో చెట్లు సరిపోవడం లేదు. రావి, చింత చెట్లు ఉంటే అందులో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అవిలేకపోవడంతో జాలీ, చీమజాలీ వంటి కంపచెట్ల పై గూళ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. రెక్కలు వచ్చి ఎగిరే సమయంలో ఆ కంపల్లో చిక్కుకొని పక్షులు నరకయాతన పడుతుంటాయి. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి పక్షుల నివాసానికి అనువైన మొక్కలు నాటాలి. ఈ మేరకు అటవీశాఖ అధికారులు చొరవ చూపాలి. ప్రభుత్వం నిధులు కేటాయించి పక్షులను సంరక్షించాలి.
కృత్రిమ గూళ్లు ఏర్పాటు చేయాలి
గిరీశ్ రెడ్డి, వీరాపురం గ్రామస్తుడు.
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. పక్షులను సంరక్షించడానికి వాటిని ఆకర్షించేలాగా కత్రిమ పక్షి గూళ్లు ఏర్పాటు చేయవచ్చు. ఉన్న చెట్లు, ఇళ్ల మిద్దెలపై కత్తిమ గూళ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక్కడ మంచి ఆహారాన్నీ పక్షులకు ఇవ్వొచ్చు. ఆ రకంగా ఏర్పాటు చేసి ఉంటే ఈ రోజు వందలాది పక్షిపిల్లలు కిందపడి మతి చెందేవి కాదు. పక్షుల సంరక్షణపై అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాల వైపల్యం ప్రతి ఏడాది కన్పిస్తోంది. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వీడి పక్షుల సంరక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి.
పక్షులు మతి బాధకరం
లక్ష్మీపతిరెడ్డి, గ్రామ సర్పంచి.
సైబీరియన్ పక్షులను ఎంతో ప్రేమగా చూసుకుంటాం. మా ఊరికి వచ్చే అతిథులుగా వాటిని గ్రామస్తులు అందరూ భావిస్తారు. అలాంటి పక్షులు గాలివానకు కింద పడి మరణించడం బాధాకరం. వీటి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సోమవారం రాత్రి నుంచి గ్రామస్తులు అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రాబోయే కాలంలో ఇలాంటివి పునరావతం కాకుండా సంబంధిత శాఖ అధికారులు పక్షులకు రక్షణ కల్పించాలి.










