Sep 14,2023 20:52

రైతులతో మాట్లాడుతున్న మేనేజర్‌ షణ్ముఖరాజు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : ఖరీఫ్‌ సీజన్లో రైతులు తమ పొలాల గట్లపై కూరగాయల పెంపకంతో అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ పి.షణ్ముఖరాజు అన్నారు. గురువారం పెదబొండపల్లి, పుట్టూరులో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన ఆయన వరి కాంపౌండ్‌ బ్లాకులను సందర్శించి మూడు నుంచి ఐదు అడుగులు వెడల్పు ఉన్న వరిగట్లపై శాశ్వత జీవామృత కుండీలను ఏర్పాటు చేసుకొని గట్లు పైన బెండ, చిక్కుడు, కంది, బంతి, బీర, వంగ, అరటి, మునగ, బొప్పాయి, కరివేపాకు వంటి పంటలు సాగు చేయొచ్చన్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. అలాగే పుట్టూరులో ఎటిఎం మోడల్‌ను కూడా సందర్శించి 365 రోజులు పంట పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్‌ వై శ్రీరాములు పాల్గొన్నారు.