Oct 19,2023 19:46

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
కాంగ్రెస్‌కు గత వైభవాన్ని తెచ్చేందుకు ప్రతి కార్యకర్తా సైనికునిలా పనిచేయాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. రాహుల్‌ గాంధీ జోడోయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ మైనారిటీ విభాగ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురువారం పట్టణంలోని చిన్న మార్కెట్‌ మీదుగా ప్రభుత్వ మహిళ హాస్పిటల్‌ నుంచి ఎమ్మిగనూరు క్రాస్‌ రోడ్డు, ఆస్పరి రోడ్డు వరకు జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. అనంతరం జీవనజ్యోతి ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మైనారిటీ విభాగ జిల్లా అధ్యక్షులు ఎమ్‌ఎమ్‌డి.నూర్‌ మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్‌కు దశ దిశ తిరిగిందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించడమే కాకుండా ప్రాంతీయ పార్టీలపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బిజెపి పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఎస్సీ సెల్‌ విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి తాయన్న మాట్లాడుతూ... భావిభారత ప్రధాని రాహుల్‌ గాంధీ అని స్పష్టం చేశారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని వివరించారు. మైనారిటీ విభాగ జిల్లా ఉపాధ్యక్షులు వలీబాష, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఖాద్రీ బాష, జిల్లా కార్యదర్శి అహ్మద్‌, మండల అధ్యక్షులు అయ్యన్న, ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షులు నెట్టేకల్లు, హనుమంతు పాల్గొన్నారు.