Aug 28,2023 22:01

దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు రమణారావు

ప్రజాశక్తి-పాలకొండ రూరల్‌ : పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎపి గ్రామపంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ఎంపిడిఒ కార్యాలయం ఎదుట గ్రీన్‌ అంబాసిడర్లు సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ మండలంలో 32 పంచాయతీల్లో 72 మంది స్వచ్ఛభారత్‌ క్లాప్‌మిత్ర కార్మికులు ఉన్నారని, 6 నెలల నుండి రెండేళ్ల వరకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అతి తక్కువ వేతనజీవులైన పంచాయతీ కార్మికుల జీతాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటే ఎలా జీవించాలని ప్రశ్నించారు. పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ అమలు చేయాలన్నారు. పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపిడిఒ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని, గ్రీన్‌ అంబాసిడర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దీక్షలను విరమించారు. గ్రీన్‌ అంబాసిడర్ల సంఘం మండల గౌరవ అధ్యక్షులు కాద రాము అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో ఎన్‌.గురువులు, బి.రవి, సిహెచ్‌.శంకర్రావు, జి.దుర్గారావు, ఎ.కూర్మారావు, బి.ఆనంద రావు, ఎస్‌.సూర్యనారాయణ, కె.రాము, కె.శ్రీను, బి.వెంకయ్య, ఆర్‌.సత్యం, బి.దాసు, ఆర్‌.పకీరు, ఆర్‌.రాజారావు, జి.గౌరమ్మ, ఎం.పార్వతమ్మ, ఎం.అప్పారావు, డి.కూర్మయ్య, ఎ.బాబూరావు, సిహెచ్‌ సోములు, ఎ.రామారావు తదితరులు పాల్గొన్నారు.