పోలవరం కాలువ గట్టును తవ్వేస్తున్న మట్టిమాఫియా
పట్టించుకోని అధికారులు, ప్రజల నుంచి విమర్శలు
ప్రజాశక్తి - ఉంగుటూరు
మండలంలోని కైకరం, చేబ్రోలు గ్రామాల్లో గ్రావెల్, కంకర గుట్టలను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. గ్రావెల్ అవసరమైనవారు అనుమతులున్న క్వారీల ద్వారా కొనుక్కోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు మట్టి మాఫియా రూటు మార్చింది. శని, ఆదివారాల్లో రాత్రిళ్లు పోలవరం కాలువ గట్టు నేలను, కంకర గుట్టలను తవ్వేసి భారీ వాహనాలతో ఖాళీ ప్రాంతాల్లో నిల్వ చేసి అమ్ముకుంటున్నారు. ఎలాంటి మైనింగ్, చెస్‌లు లేకుండా కంకర నిల్వలు, అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధలనకు విరుద్దమైనా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కాలువ గట్టు నేలలో నాణ్యమైన కంకర లభ్యమౌతుంది. దీనికి మంచి గిరాకీ, ధర ఉంటుంది. ఈ క్రమంలో రాత్రిళ్లు కాలువ గట్టు నేలను తవ్వేసి కంకరను తరలించి భారీ ఎత్తున కొండల్లా నిల్వలు ఉంచి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధలనుకు విరుద్ధంగా తవ్వేసిన కంకరను కైకరంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రోడ్లకు సైతం వినియెగించడం గమనార్హం. కైకరంలో అక్రమంగా నిల్వ ఉంచిన కంకరపై కథనాలు ప్రచురించవద్దని కొందరు ప్రజాశక్తిపై ఒత్తిడి తెస్తున్నారు.










