ప్రజాశక్తి బత్తలపల్లి : గ్రామాల్లో చెట్లు నరకడం, బోర్లు పూడ్చడం వంటి సంస్కృతి తిమ్మంపల్లి వైపు నుంచే వచ్చిందని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ విమర్శించారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన కప్పల గంగయ్యకు చెందిన బోరుబావిని స్థానికంగా ఉన్న అధికారపార్టీ నాయకులు పూడ్చివేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గ్రామ సమీపంలో గంగయ్యకు 1500 చీనీ చెట్లు ఉన్న తోట ఉండగా 19వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బోరుబావిని పూడ్చివేశారు. దీనివలన బోరు సామాగ్రి తో పాటు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ సోమవారం గ్రామానికి వెళ్లి బాధిత రైతును పరామర్శించారు. పూడ్చిన బోరును పరిశీలించారు. ఈనెల 18వ తేదీన గంగయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల శ్రీరామ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత రోజే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు వాపోయారు. ఈ సంఘటనపై పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. గ్రామాల్లో ఏవైనా రాజకీయంగా గొడవలు ఉంటే రాజకీయంగానే చూసుకోవాలి కానీ ఇలా పచ్చని చెట్లకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించడం తగదన్నారు. గతంలో ఈ గ్రామానికి సమీపంలో ఉన్న యల్లనూరు పుట్లూరు మండలాల్లో ఇలాంటి సంస్కృతి ఉండేదని దానికి ఎవరు ఆజ్యం పోశారో అందరికీ తెలుసునని అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే సంస్కృతి పడగలు విప్పడం ఆందోళనకరమన్నారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ విష సంస్కృతిని ఆదిలోనే తుంచి వేయాలని సూచించారు. ఇప్పటికైనా ఇలాంటి వాటికి ముగింపు పలకాలని లేకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.










