ప్రజాశక్తి -సీలేరు : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎస్సై రామకృష్ణ సోమవారం విస్తృతంగా పర్యటించారు. జీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ రాంపురం, హరిపురం, జి.నేరేడుపల్లి, రాళ్లగెడ్డ, పెద్ద గొంది, పెట్రాయి, నిమ్మ చెట్టు, చిన్న గంగవరం తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన గిరిజనులతో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా, సాగు తదితర అంశాలపై గిరిజన యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. గంజాయి అక్రమ రవాణా సాగు చట్టరీత్యా నేరమని, తెలిసికూడా కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు బానిసై ఆ బాటలోని నడుస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. యువత మంచి మార్గాల్లో నడుచుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. పోలీసుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గంజాయి సాగువలన కలిగే అనర్ధాలపై అనేకసార్లు అవగాహన సదస్సులు నిర్వహించామని, గిరిజనులు ఆర్థికంగా బలోపేతం కావడానికి గంజాయి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలుగా రాజ్‌మా, జాపరు పండ్లు, జీడి మామిడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. యువత క్రీడలపై దృష్టి సారించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువత చైతన్యవంతులుగా మారి పరస్పరం సహకరించుకోవాలని కోరారు. అనంతరం క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు ఎస్సై రామకృష్ణ పంపిణీ చేశారు.










