గ్రామాల అభివృద్ధే ధ్యేయం
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
ప్రజాశక్తి - సంజామల
గ్రామాలను అభివృద్ధి చేయడమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం సంజామల మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనం, రూ.1.3 కోట్లతో చేపట్టిన మండల పరిషత్ భవనాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అన్ని వసతులను సిఎం జగన్‌మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల వారు ఎన్నో అబద్ధాలు చెబుతుంటారని, ప్రజలు వాటి నమ్మవద్దని అన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయని, ప్రజలు వీటిని ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నవరత్నాల పథకాలను అమలు చేస్తూ చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు పోచ రమాదేవి, షీలా రెడ్డి, గుండం సూర్యప్రకాశ్ రెడ్డి, చిన్నబాబు, జెడ్పిటిసి మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, అన్ని గ్రామాల నాయకులు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు.










