Sep 07,2023 22:44

నిరసన తెలుపుతున్న గ్రామ పంచాయతీ కార్మికులు

        అనంతపురం కలెక్టరేట్‌ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపిఒ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నాడు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్‌, నగర కార్యదర్శి వెంకటనారాయణ, గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శివ ప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలన్నారు. ఈఎస్‌ఐ పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కార్మికులకు వేతనాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిపిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు మధు, నాగేంద్ర, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.