Oct 22,2023 23:51

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :


గోవింద భక్తుల సేవంటే ఎంతో సంతోషం


టీటీడీ జేఏసీ అన్నదానంలో బోర్డు సభ్యులు నాగసత్యం

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : తిరుమల గోవిందుని భక్తులకు సేవచేయడం అంటే తరతరాల పుణ్యమే అని టీటీడీ బోర్డు సభ్యులు ఎన్‌.నాగసత్యం అన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ జేఏసీ, టీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడైన కె.ఆంజనేయులు దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో అలిపిరి గరుడ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్నదానంలో టీటీడీ బోర్డు సభ్యులు జివి. సుబ్బరాజు, సి.అశ్వర్థ నాయక్‌ కూడా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు ఆంజనేయులు దంపతులు భక్తులకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా తమ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భక్తులకు పెద్దఎత్తున అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అందులో భాగంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా అలిపిరి గరుడ సర్కిల్‌ వద్ద ఈ బహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు హాజరై తమ దంపతులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి వెంకటరత్నం, సభ్యులు సుబ్రహ్మణ్యం రెడ్డి, బాలసుబ్రమణ్యం, క్రాంతి, ఎలక్ట్రికల్‌ విభాగం చెన్నూరు సుబ్రమణ్యం, శివకుమార్‌, భక్తులు పాల్గొన్నారు.