న్యూఢిల్లీ : గోప్యతా హక్కును తాము గౌరవిస్తామని కేంద్రం బుధవారం తెలియజేసింది. పంపించే సందేశాలు లేదా సమాచారం మూలాలు తెలుసుకోవాలనే నిబంధన దేశ సార్వభౌమాధికారానికి లేదా శాంతిభద్రతలకు సంబంధించి తీవ్రమైన నేరాల దర్యాప్తు కోసమేనని, అటువంటి వాటిని నివారించడానికేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి రాకుండా చివరి నిముషంలో వాట్సాప్ సవాలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా వంటి దేశాల్లో చట్టపరమైన అంతరాయాలను కూడా సోషల్ మీడియా సంస్థలు అనుమతించాల్సి వుంది. ఇక్కడ భారత్లో ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్నదానికంటే తక్కువే కోరుతున్నామని ఆ ప్రకటన పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు గోప్యతా హక్కుకు విరుద్ధమని చెప్పడానికి వాట్సాప్ ప్రయత్నించడం సరైన పనికాదని పేర్కొంది. గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం గుర్తించిందని, పౌరులందరికీ దీన్ని అమలు చేసేందుకు కట్టుబడి వున్నామని పేర్కొంది. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యల్లో ఏవీ కూడా వాట్సాప్ సాధారణ పనితీరును ప్రభావితం చేయవని ఐటి మంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఒక సందేశం యొక్క మూలాన్ని వాట్సాప్ వెల్లడించాల్సి వచ్చినంత మాత్రాన గోప్యతా హక్కును ఉల్లంఘించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది.










