కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వైసిపి నేత యార్లగడ్డ వెంకట్రావు
ప్రజాశక్తి-గన్నవరం : తాను అమెరికా వెళ్ళిపోతానని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు ఇదే చెబుతున్న.. గన్నవరం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైఎస్‌ఆర్ సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరంలోని ఎస్ ఎం కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం వైఎస్‌ఆర్సిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం వేలాది మందితో జరిగింది. రెండేళ్ల తర్వాత యార్లగడ్డ గన్నవరం లో పెట్టిన తొలి సమావేశం కావడంతో నియోజకవర్గం లోని నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్‌ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ ఆవేశపూ రితంగా మాట్లాడారు. గన్నవరం నియోజకవర్గంలో రాజకీయంగా ఈసారి తన పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని చెప్పడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలూ, కేకలు వేశారు. జై..జై.. యార్లగడ్డ అంటూ చిందులు తొక్కారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తాను ఓటమి చెందిన తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ఇదే అతనుగా భావించిన కొంతమంది రాజకీయ శక్తులు తాను అమెరికా వెళ్ళిపోతానని, ఇక గన్నవరం వైపు తొంగి చూడనని ప్రచారం చేస్తున్నారని, ఇంతమంది అభిమానం.. ఆప్యాయతలు చూసిన తర్వాత గన్నవరం వదిలి వెళ్లే ప్రసక్తే లేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. తాను పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏమీ చేయలేకపోయినా తన మీద ఇంతటి అభిమానం.. ప్రేమ చూపించిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా పనిచేసి జిల్లాలోని రైతులకు ఎనలేని సేవలు చేయడం ద్వారా వారి మన్న నలు పొందానని గుర్తు చేశారు. అదే సమయంలో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి తనకు అండదండగా నిలిచిన నాయకులకు కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం తలచుకుంటే ఎంతో బాధగా ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండ లేకుండా పోయిందని, అందుకే తాను రావాలని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటున్నారని ఈ అభిమానమే తనను గన్నవరం వైపు నడిపించిందని వివరించారు. విజయవాడలో బయలుదేరిన తాను రామవరప్పాడు నుంచి గన్నవరం సభాస్థలికి రావడానికి మూడున్నర గంటలు పట్టిందంటే ప్రజాభిమానం ఎంత మెండుగా నడిపించిందో తనకు అర్థమైందన్నారు. ఇకనుంచి గన్నవరంలో తన రాజకీయమెంటో చూపిస్తానని డంకాపదంగా చెప్పారు. పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ తనకు అన్యాయం చేయరనే నమ్మకాన్ని యార్లగడ్డ వ్యక్తం చేశారు. అమెరికా నుండి వచ్చిన తనను క్రాస్ రోడ్ లో వదిలివేయరనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్, బాపులపాడు మండలాల నుంచి జనం వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి గన్నవరం వరకు బైకులు కార్ల లో యార్లగడ్డ ర్యాలీగా తరలివచ్చారు.










