Jun 24,2023 09:07

పట్టుబడిన స్కార్పియో వాహనం

         ముదిగుబ్బ : గంజాయి మత్తులో ఐదుగురు యువకులు ముదిగుబ్బ సమీపంలో శుక్రవారం సాయంత్రం హల్‌చల్‌ చేశారు. అతివేగంతో స్కార్పియో వాహనాన్ని నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. స్థానికులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్నం పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఐదుగురు యువకులు ఎపి09 సిహెచ్‌2373 నెంబర్‌గల వాహనంలో కదిరి నుంచి అనంతపురం వైపునకు ప్రయాణిస్తున్నారు. గంజాయి మత్తులో ఉన్న వీరు అతివేగంతో వాహనం నడుపుతున్నారు. పట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాలసముద్రం గ్రామం సమీపాన ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడుని ఇన్నోవాలో వెళ్తున్న యువకులు అడ్డగించారు. ద్విచక్రవాహనదారున్ని బెదిరించి అతని నుంచి ఫోన్‌పే ద్వారా రూ.18 వేలను వారి ఖాతాలోకి బలవంతంగా వేయించుకున్నారు. అక్కడి నుంచి ముదిగుబ్బ వైపు అతివేగంగా ప్రయాణించారు. ముదిగుబ్బ సమీపంలో ఒక ఆటోను వేగంగా ఢ కొనడంతో ఆటోలో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఇలా అతివేగంతో స్కార్పియో వాహనం అనంతపురం వైపునకు వెళ్తుండగా స్థానికులు 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కాకతీయ పాఠశాల వద్ద జెసిబిని రోడ్డుకు అడ్డుపెట్టి ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంతో సహా అందులో ఉన్న యువకులను పట్నం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వాహనాన్ని పరిశీలించగా అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్‌ లభించింది. ఈ యువకులు అనంతపురం నగరం శారదానగర్‌కు చెందిన షేక్‌ ఫరీద్‌, నాగభాస్కర్‌, జి.కార్తీక్‌, డి.కార్తీక్‌గా తాడిపత్రికి చెందిన దిలీప్‌ గుర్తించారు. ఈ యువకులు ఎవరు.? ఇందులో ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు ఉందన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.