గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
కేసుల నమోదులో బాధ్యతగా వ్యవహారించాలి - ఎస్పీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
గంజాయి అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపేల పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తూర్పు ప్రాంతాల నుండి గంజాయి నంద్యాల జిల్లా కు రవాణ కాకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ కె. రఘు వీర్ రెడ్డి అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి మంగళవారం నంద్యాల పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి నంద్యాల ,ఆత్మకూరు,డోన్, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లు , సర్కిల్ పోలీస్ మరియు స్టేషన్ల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశమును నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నేరనియంత్రణకు,గంజాయి,పిడిఎస్ రైస్,నాటుసారాయి తదితర అక్రమ రవాణా కార్యకలాపాలు చేస్తున్న వారి పై ఉక్కు పాదం మోపలంటే విజిబుల్ పోలీసింగే ప్రధాన ఆయుధమని, విజిబుల్ పోలిసింగ్ ను ప్రతి రోజు నిర్వహిస్తే నేరాలను నివారించవచ్చన్నారు. దర్యాప్తు అంశాలలో, విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులు తీరు మార్చుకో లేకపోతే మూల్యం చెల్లించక తప్పదనీ జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసులు నమోదు చేయు విషయంలో ప్రతి పోలీస్ అధికారి బాధ్యతగా వ్యవహరించాలని కేసులను నమోదు చేసి కోర్టుకు పంపిన తర్వాత బాధ్యత తీరిపోతుందని అనుకుంటే అది పొరపాటని పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టుకు సరైన ఆధారాలు చూపి బాధితులకు తగిన న్యాయం చేసినప్పుడే మన బాధ్యత ముగిస్తుందన్నారు., నేర నియంత్రణ కొరకు పోలీస్ అధికారులు అందరూ పటిష్టముగా సమన్వయంతో విధి నిర్వహణ చేయాలని జిల్లా ఎస్పీ అధికారులు అందరికీ తగిన సూచనలు సలహాలను ఆదేశాలను జారీ చేశారు.అధికారులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలను గురించి, కోర్టు కేసుల విషయాల గురించి తెలుసుకొని కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి సరైన మార్గదర్శకాలను ఇవ్వాలని ఎస్పీ సూచించారు.జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి , ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలు, నాటు సారాయి, గంజాయి మొదలగు పదార్థాల నియంత్రణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మహిళా సంరక్షణ కార్యదర్శి క్షేత్రస్థాయిలో వారికి ప్రభుత్వం వారు నిర్ణయించిన ఉద్యోగ నిర్వహణను గురించి ప్రతి మంగళ వారము స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారు సమావేశం నిర్వహించి వారికి దశ నిర్దేశం చేసి విదులు నిర్వహించేలా, వారు సేకరించవలసిన సమాచారం గురించి ప్రతి గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శికి అవగాహణ కల్పించాలని పేర్కొన్నారు. హైవే పై వాహన తనిఖీలు నిర్వహిస్తూ రాత్రిపూట వాహనదారులకు ఫేస్ వాష్ డ్రైవ్ ను నిర్వహిస్తూ రహదారి ప్రమాదాల నివారణ కొరకు రోడ్ సేఫ్టీ మొబైల్స్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు.తరచూ దొంగతనాలు జరుగు ప్రాంతాలలో రాత్రి పగలు బీట్ సిస్టంను బలోపేతం చేసి అక్కడ పాయింట్ బుక్ లను ఏర్పాటు చేయడమే కాకుండా రక్షక్ మరియు బ్లూ కొల్ట్ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం సమగ్రమైన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి జె.వి సంతోష్ , డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సిఐ జయరాములు, ఎస్సై లు సూర్యమౌళి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










