Jul 24,2023 21:59

గంజాయి

           హిందూపురం : గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి వస్తోంది. విశాఖపట్నం, అరకు ప్రాంతాలకు చెందిన కొందరితో సంబంధాలు పెట్టుకుని జిల్లా ప్రాంతం వాసులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్నారు. బయట నుంచి తీసుకువచ్చిన గంజాయిని చిన్నచిన్న పాకెట్లలో విక్రయిస్తున్నారు. చిన్న ప్యాకెట్‌ గంజాయి రూ.వంద వరకూ పలుకుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. హిందూపురం కేంద్రంగా గంజాయి ఎగుమతి, దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది.
చెడు వ్యసనాలకు బానిసైన కొందరు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. విశాఖ నుంచి హిందూపురానికి గంజాయిని తీసుకొచ్చి అక్కడి నుంచి హిందూపురంతో పాటు అనంతపురంలోని కొన్ని ప్రాంతాలకు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి తరలింపులో పురం పారిశ్రామిక వాడలో వివిధ పరిశ్రమల్లో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరంత ఎవరికీ అనుమానం రాకుండా రైలులో వెళ్లి, అదే రైలులోనే తీసుకొచ్చి రైల్వే స్టేషన్‌ సమీపంలో దాచి పెట్టి క్రయ విక్రయాలు జరుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి నుంచి పట్టణానికి చెందిన కొంద మంది యువకులు కొనుగోలు చేసి సేవించడంతో పాటు ఇతరులకూ అధిక డబ్బులకు విక్రయిస్తున్నారు. గతంలో కర్నాటక మధ్యాన్ని విక్రయించే వారు సైతం అధిక లాభాలు వస్తుండడంతో గంజాయి అమ్మకాలపై దృష్టి సారించారు. పట్టణం నుంచి వేలాది మంది నిత్యం బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు ఉపాది కోసం రాక పోకలు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారు సైతం పెద్ద ఎత్తున వచ్చి వెళుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఈ గంజాయి మహమ్మారికి అలవాటు పడి వాటి విక్రయాల ఉచ్చులో పడుతున్నారు. వీరంతా పురం పారిశ్రామిక వాడిలోని కార్మికులతో కలిసి పోతుండడంతో వారిని పోలీసులు గుర్తించడంలో కష్టం అవుతోంది. ఇటీవల గంజాయిపై జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపడంతో దీనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఎనిమిది మందిని అరెస్టు చేసి దాదాపు 9 కిలోల గంజాయిని హిందూపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి మత్తులో యువత
యువత గంజాయి మత్తులో తూలుతు పెడదోవ పడుతోంది. ఈ మత్తుకు బానీసలైన వారిలో ఎక్కువ మంది 30 సంవత్సరాలలోపు ఉన్న వారే ఉన్నారు. హిందూపురం ప్రాంతంలో ఖాళీ ప్రదేశాలు, వెంచర్లు వేసిన ప్రాంతాలను స్థావారాలుగా చేసుకుంటున్నారు. గుంపులుగా చేరి గంజాయిగుప్పు గుప్పున పీలుస్తున్నారు. ఈమత్తులోనే నేరాలకూ పాల్పడుతున్నారు. దారిలో ఎవరైన కనిపిస్తే దాడికి దిగుతున్నారు. విద్యార్థినులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాలు, గ్రామాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు.
ఇవే అడ్డాలు...
హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, అనంతపురం జిల్లాలోని అనంతపురం తదితర పట్టణాలు మండల కేంద్రాల్లో సైతం గంజాయి లభిస్తున్నట్లు అరోపణులు వినపిస్తున్నాయి. పాన్‌ సెంటర్లు, డాబాలు, రైల్వే స్టేషన్‌, ఆర్‌టిసి బస్టాండ్‌ తదితర ప్రాంతాలను అడ్డగా చేసుకుని వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి ఎక్కడ దొరుకుతుందో దానికి బానిసలైన యువత వద్ద పక్క సమచారం ఉటుంది. కోడ్‌ భాషలో యువకులు దీనిని కొనుగోలు చేస్తున్నారు. ఈ మత్తుకు బానిసనైన వారు మరికొందరికి అలవాటు చేస్తున్నారు. గతంలో హిందూపురంలో గంజాయి అంటే ఏమిటో తెలియదు, ప్రస్తుతం కిలోల కొద్ది గంజాయి పట్టుబడుతోంది.
గంజాయి రవాణాపై నిఘా
డీఎస్పీ కంజాక్షన్‌

గంజాయి అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపేల పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచాం. హిందూపురం ప్రాంతలో రవాణ కాకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలు, నాటు సారాయి, గంజాయి మొదలగు పదార్థాల నియంత్రణ విషయంలో పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాం. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోరాదు. గంజాయి విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తాం. ఎక్కడైనా వీటి విక్రయాలు జరుగుతుంటే సంబంధిత ప్రాంతాల ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.