కురుపాం: మండలంలో జరడ పంచాయతీలోని గిరిశిఖర గ్రామాల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరించింది. గిరిజనులు సాగు చేస్తున్న కొండచీపుర్లు, అరటి, పసుపు తదితర అటవీ ఉత్పత్తులను, తాగునీటి పైపులు, ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న గిరి శిఖర గ్రామాల్లో ఏనుగులు సంచరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తెల్లవారితే కొండ ప్రాంతంలో పనిచేసుకుంటూ అటవీ ఫలసాయాలను ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటామని, ఏనుగుల సంచారంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీరఘట్టం: ఏనుగుల గుంపును జూకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కొమరాడ మండలం అర్తం జంక్షన్లో హరి ఏనుగు సోమవారం ప్రధాన రహదారిపై రాయగడ నుండి వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందుబాగాన అద్దం పగల కొట్టి హల్‌చల్ చేసిందన్నారు. జరగరాని ప్రమాదం జరిగి ఉంటే దీనికి బాధ్యులు ఎవరని అధికారులను ప్రశ్నించారు. మన్యం జిల్లాలో ఏనుగులు సంచారం కారణంగా వందలాది ఎకరాలు పంట నాశనం అవుతున్న కనీసం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయనగరం జిల్లా వంగర మండలం తలగం గ్రామం నుండి వీరఘట్టం మండలంలోని కిమ్మి నడుకూరు గ్రామాల్లో ఏనుగుల గుంపు తిష్ట వేయడంతో అప్పట్లో పంట నష్టాలను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే వి కళావతి, ఎమ్మెల్సీ పి విక్రాంత్‌లు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన పంటకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మరిచారన్నారు. ఇప్పటికైనా పాలకుల స్పందించి ఏనుగులను జూకు తరలించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమ కార్యక్రమం చేపడతాయని ఆయన హెచ్చరించారు.










