ప్రజాశక్తి-డుంబ్రిగుడ:రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా వైద్య సేవలను అందించేందుకు గాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మండలంలోని జైపూర్ జంక్షన్ వద్ద ఇంగ్లీష్ మీడియం బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10వేల 574మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో గడప గడపకు ప్రతి వ్యక్తికి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలందించడానికి నాలుగు నుంచి ఐదు వేల మంది స్పెషలిస్టు వైద్యాధికారులతో మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పాడేరులో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కాలేజీను జనవరిలో ప్రారంభించి గిరిజనులు మైదాన ప్రాంతానికి వెళ్లకుండా దగ్గరలోనే వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.విశాఖ కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైబల్ సెల్ ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. గిరిజనుల శ్రేయస్సు కోసమే గతంలో టిడిపి తీసుకొచ్చిన బాక్సైట్ జీవోను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని ఆమె గుర్తు చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధి పేరిట టిడిపి దత్తత తీసుకొని ఏమీ చేయలేదని విమర్శించారు.రాబోయే రోజుల్లో టిడిపికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ చీఫ్ సెక్రటరీ నివాస్, ఏఎస్పీ దిరాజ్, ఐటీడీఏ పీవో అభిషేక్, డిఎం అండ్ హెచ్‌ఓ జమల్ భాష, ఎమ్మెల్యేలు పాల్గుణ, భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, ఎంపీపీ బి.ఈశ్వరి, కిల్లోగూడ పీహెచ్‌సి వైద్యాధికారి కే.కరుణ, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.










