ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : తరతరాల నుంచి తమ సాగులో ఉన్న వన సంరక్షణ సమితి భూములకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రక్షణ కల్పించాలని సిపిఎం ఆధ్వర్యాన జెకెపాడు గిరిజనులు శనివారం నిరసన చేపట్టారు. కొందరు నాయకులు ఇళ్ల స్థలాల పేరుతో బయట ప్రాంతాలకు చెందిన గిరిజనులను తీసుకువచ్చి విఎస్‌ఎస్ భూమిని దౌర్జన్యంగా, అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్ని స్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా తోలుఖర్జ, మంగళాపురం గ్రామాలకు చెందిన గిరిజనులకు, జెకె పాడు గిరిజనులకు మధ్య తగాదా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్ అన్నారు. ఇళ్ల స్థలాలు అడుగుతున్న వారికి ఇదివరకే రెండు మూడు ఇళ్లు ఉన్నాయని అధికారుల విచారణలో తేలిందన్నారు. విఎస్‌ఎస్ భూమిని సాగుచేస్తున్న జెకెపాడు గిరిజనులకు అటవీశాఖ అధికారులు ఉమ్మడి పట్టా కూడా మంజూరు చేశారని తెలిపారు. దౌర్జన్యంగా భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న నాయకులపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండంగి రమణ, ఎం.సన్యాసిరావు, గిరిజనులు పాల్గొన్నారు.










