Jun 27,2023 21:36

పాఠశాల వద్ద ఉన్న విద్యార్థులు

గిరిజన పాఠశాల మూత
- ఉన్న ఉపాధ్యాయుడూ బదిలీ
- చెంచు గూడెం విద్యార్థులకు అందని విద్య
- తల్లిదండ్రులతో కలిసి అడవి బాట
ప్రజాశక్తి - ఆత్మకూరు

     ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం చెంచుగూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూత పడింది. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ప్రాథమిక పాఠశాల నిర్వహణ శూన్యంగా మారింది. చెంచు గూడెం విద్యార్థులకు విద్య బోధించే వారు కరువయ్యారు. ఉపాధ్యాయులు లేకపోవడం, పాఠశాలను తెరిచే వారు లేక మూతపడడంతో విద్యార్థులు మంగళవారం పాఠశాలకు వచ్చిన బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసిన గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జవహర్‌ నాయక్‌ ఇందిరేశ్వరం చెంచుగూడెం చేరుకుని పాఠశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులను నియమించి, మూత పడిన పాఠశాలను తెరవాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల మూత పడడంతో విద్యార్థులు తల్లిదండ్రుల వెంట అడవిబాట పడుతున్నారని చెప్పారు. చెంచు గిరిజన విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యాకానుక, మధ్యాహ్న భోజనం గిరిజన విద్యార్థులకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెంచు గిరిజనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఫలాలు మాత్రం వారికి సక్రమంగా అందడం లేదన్నారు. తరతరాలుగా చెంచు గిరిజనులకు వెంటాడుతున్న నిరక్షరాస్యత, తమ అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లలేని అమాయక పరిస్థితి, ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యం, పర్యవేక్షణా లోపం రకరకాల కారణాల వల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు. గిరిజన విద్యార్థుల గురించి ఐటిడిఎ అధికారులు, జిల్లా ట్రైబల్‌ అధికారులు, స్థానిక విద్యాశాఖ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఇందిరేశ్వరం చెంచుగూడెం పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థులకు విద్యను అందించాలని, జగనన్న విద్యా కానుకను, మధ్యాహ్న భోజనం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.