ప్రజాశక్తి - ఆదోని
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కల్లుబావి వీధిలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ ఛైర్మన్ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో అందుతున్న సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బిపి, షుగర్, రక్తహీనత , దగ్గు, జ్వరం, తలనొప్పి, ఇతర దీర్ఘకాలిక రోగాలకు కచ్చితంగా పరీక్షలు నిర్వహించి, కావాల్సిన మందులు నెలనెల పంపిణీ చేస్తారని తెలిపారు. గడపగడపకు వెళ్లి ఎఎన్‌ఎంలు పరీక్షలు నిర్వహించి ఇప్పటికే రోగులను గుర్తించారని చెప్పారు. వారందరికీ కావాల్సిన పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడే మందులు ఇస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. ఆదోని అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. వార్డు నాయకులు గోవిందు, స్వామి దాసు, గణేష్, వైసిపి సీనియర్ నాయకులు నాగేంద్ర, రామాంజి, చంద్రకాంత్ రెడ్డి ఉన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి










