ప్రజాశక్తి - డెస్క్
గాంధీ జయంతిని హింసకు వ్యతిరేకంగా, అహింసకు ప్రతిరూపంగా వాడవాడలా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛతకు నిదర్శనంగా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పాలకులు ఘనంగా చెప్పుకుంటున్నారు. అయితే స్వచ్ఛభారత్, స్వచ్ఛ తా హి సేవ పేరిట గాంధీ జయంతి సందర్భంగా రెండు మూడు రోజులు హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో పల్లెలు కంపు కొడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో జాతి పిత మహాత్మగాంధీకి వీడదీయలేని అనుబంధం ఉంది. జాతీయస్థాయిలో స్వాతంత్రోద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం విజయవంతమైన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం రెండో బార్డోలిగా గాంధీచే పిలవబడింది. దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత ప్రముఖ ఆదర్శ నేతగా నేటికీ అందరిచే పిలవబడే పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ ప్రస్థానం ఈ జిల్లాలోనే ప్రారంభమైంది. స్వాతంత్రోద్యమ కాలంలో జిల్లాలోని వివిధ పట్టణాల మీదుగా గాంధీ పర్యటన సాగిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో గాంధీ జయంతినాడు మహాత్ముని కలలు జిల్లాలో సాక్షాత్కిరించాయో లేదో మనం పరిశీలిస్తే కొంత బాధాకరమైన సమాధానమే వస్తోంది.
నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జిల్లాలో అనూహ్య రీతిలో నేరాలు పెరిగిపోయాయి. బాలికలపై, మహిళలపై వావీవరసలు మరచి అఘాయిత్యాల పరంగా హత్యలు, మోసాలు అదేస్థాయిలో నమోదవుతున్నాయి. మండవల్లిలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బాలికను వరుసకు సోదరుడు, అతని పరిచయస్తులే చరబట్టడం.. అలాగే భీమవరం గాంధీనగర్‌లోని బాలికపై చిన్నాన్నే హత్యాచారానికి పాల్పడడం అందరినీ నివ్వెరపరచింది. నిర్భయ, దిశ వంటి చట్టాలతో మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవనడానికి ఈ సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనం. ఇదే సమయంలో పాలకులే హింసకు దిగడం, ప్రజలకు ఎక్కడ, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. గడప దాటి బయటకు వెళ్లిన మహిళలు, చిన్నారులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో లేదోగాని హక్కులపై ఉద్యమిస్తున్న నేతలు సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలు మాత్రం పోలీస్‌స్టేషన్లలోనూ, గృహాల్లోనూ నిర్బంధానికి గురవుతున్నారు. కనీసం గాంధీజీ తెలిపిన శాంతియుత నిరసనలకు సైతం ఈ పాలకులు అనుమతించకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం రెండు జిల్లాల్లోనూ కనిపిస్తోంది. గాంధీ వారసులమని చెప్పుకుంటూ ఆ గాంధీని హత్య చేసిన గాడ్సేను కొలిచే పాలకుల విధానాలు ఇందుకు భిన్నంగా ఉంటాయనుకోవడం అవివేకమే. ఇప్పటికైనా గాంధీ వరసులమని చెప్పుకోవడం మాని గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లక్ష్య సాధన దిశగా హింసను ప్రేరేపించే విధానాలను పాలకులు వీడాలి. అదే సమయంలో ప్రభుత్వ రక్షకులుగా కాకుండా ప్రజారక్షకులుగా పోలీసులను తీర్చిదిద్దే విధానాలు అవలంభిస్తే ఎంతోకొంత గాంధీ కోరుకున్న శాంతి.. పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో కనిపించే అవకాశం ఉంది.
గాంధీ జయంతి సందర్భంగానే స్వచ్ఛభారత్ పేరిట కొంతకాలంగా బిజెపి పాలకులు హడావుడి చేస్తున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలపై చెత్త పన్ను వేసి ఘనతను చాటుకుంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా పేరుకుపోయిన చెత్త, క్షీణించిన పారిశుధ్యంతో కంపుకొడుతున్నాయి. భీమడోలు, విస్సాకోడేరు వంటి ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పేరిట కొంత పారిశుధ్యం మెరుగుకు గట్టి కృషి జరుగుతుంది. అయితే ఇవన్నీ వేళ్లపై లెక్కగట్టగలిగిన గ్రామాలే. పట్టణాల్లో ఒక మోస్తరు వర్షం కురిస్తే మురుగునీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి చేరుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామంలో అడుగు పెట్టేటప్పుడే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం డంపింగ్ యార్డులు లేకపోవడమే. ఇప్పటికీ చాలా గ్రామాల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. దీంతో పంచాయతీలు సైతం ఏమీ చేయలేక గ్రామ శివార్లలో చెత్తను పారబోస్తున్నాయి. స్వచ్ఛభారత్ అంటే అంతా స్వచ్ఛంగా ఉండాలి తప్ప గాంధీ జయంతి రోజనే ఉంటే సరిపోదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీలకు చెందాల్సిన నిధులను సక్రమంగా విడుదల చేసి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని అంతా కోరుతున్నారు.










