పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం ఉదయం, రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు బలంగా వీచాయి. దీని దెబ్బకు పంటలు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. పుట్టపర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి గాలీవాన దెబ్బకు కరెంటు స్తంభాలు, భారీ వక్షాలు నేలకొరిగాయి. మండల పరిధిలోని పైపల్లి, బత్తలపల్లి, వెంకటగారిపల్లి, రాచువారి పల్లి, గ్రామాల్లో పంటలు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. బత్తలపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్దచెట్లు నేలకొరిగాయి. పైపల్లి బీసీ కాలనీ సమీపంలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడ్డాయి. వెంకటగారిపల్లి సమీపంలో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాచువారిపల్లి గ్రామంలో నంబూరి రంగప్పకు చెందిన రెండు ఎకరాల అరటి తోట పూర్తిగా ధ్వంసం అయింది. దాదాపు రూ.ఐదు లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. కొట్లపల్లి, జగరాజుపల్లి, వెంకటగారిపల్లి గ్రామంలో వందల ఎకరాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. పెడపల్లి పెట్రోల్ బంకు సమీపంలో ఒక హోటల్ పైకప్పు గాలికి ఎగిరిపోయింది. మండలంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు పడి విద్యుత్ వైర్లు తెగిపోయాయి. పైపల్లి, బత్తలపల్లి, పెడపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
బత్తలపల్లి : మండలంలోని పలుగ్రామాల్లో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సష్టించింది. రైతులు సాగుచేసిన పలు పంటలు నేలకొరిగాయి. షెడ్లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దాదాపు రూ.20లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచాన వేశారు. అప్రాచెరువు రెవెన్యూ గ్రామ పరిధిలోని తంబాపురంలో రైతు సానే నాగేష్ రెడ్డి పొలం వద్ద నిర్మించుకున్న రేకుల షెడ్డు పూర్తిగా ఎగిరిపోయింది. రూ. 2లక్షల వరకు నష్టం వాటిళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఇదే గ్రామంలో రైతు సానే భాస్కర్‌రెడ్డి 4.60 ఎకరాలలో 4వేల బొప్పాయి, మొక్కలు సాగుచేయగా, మూడు వేల మొక్కలు వేర్లతో సహా పైకి వచ్చి నేలవాలాయి. రూ. 3లక్షలకు పైగా నష్టం వాటిళ్లిందని రైతు వాపోయాడు. మరో రైతు రమణారెడ్డి తన పొలంలో 15 నేరేడు చెట్లు ఉండగా అవి నేలకొరిగాయి. నేరేడు కాయలతో ఉన్న చెట్లు నేలకొరగడంతో రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. ఈశ్వర్‌రెడ్డి పొలంకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైనుకు సంబంధించి 5 కరెంటు స్థంబాలు నేలనేలకొరిగాయి. గాలీ, వానకు పలు చోట్ల పంటలు దెబ్బతినగా, విద్యుత్ లైన్లు తెగపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్ధరించారు. మండలంలోని అప్రాచెరువు రెవెన్యూ గ్రామ పరిధిలో గాలీవానతో దెబ్బతిన్న పంటలను వైసిపి మండల కన్వీనర్ బగ్గిరి బయవరెడ్డి, తంబావురం సర్పంచి సానే జయచంద్రారెడ్డిలు రైతులతో కలసి పరిశీలించారు. దెబ్బతిన్న వంటల వివరాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దష్టికి తీసుకెళ్లి, రైతులకు ప్రభుత్వం నుంచి నష్టం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.










