May 21,2023 22:52

హిందూపురంలో విరిగిపడ్డ చెట్టు

ప్రజాశక్తి హిందూపురం, బత్తలపల్లి, పరిగి, ముదిగుబ్బ : హిందూపురం పట్టణంతో పాటు పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. వర్షంతో పాటు విపరీతమైన గాలులు రావడంతో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌ లో గాలి వానకు వేప చెట్టు పడిపోవటంతో ఈ చెట్టు కరెంటు తీగలకు తగులుకొని మూడు విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. వర్షం రావడం వలన ప్రజలు ఇళ్ళ లో వున్నందున ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కరెంటు సమస్యను సరిచేయడానికి సుమారు 3 రోజులు పడుతుందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఈ మూడు రోజులు అందులో ఎండాకాలంలో ఎలా వుండాలి, ఎలా బతకాలని భయపడుతున్నారు. అధికారులు అంబేద్కర్‌ నగర్‌కు త్వరగా కరెంటు సరఫరా కు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులను కోరుతున్నారు. అంబేద్కర్‌ సర్కిల్‌ లో తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు వర్షం ఎక్కువ కురవడంతో బండ్లను రోడ్డుపై వదిలి పక్కన ఉన్న దుకాణాల్లో వెళ్లారు. విపరీతమైన గాలికి తోపుడు బండ్లు వాహనం తరహా పరుగులెత్తాయి. శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం సుబ్బరాయనపల్లి గ్రామంలో భారీగాలులు, వర్షానికి చెట్టు విరిగిపడి రైతు శ్రీరామప్పకు చెందిన గేదె మృతి చెందింది. హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలులకు కుప్పకూలాయి. ఈ సమయంలో ప్రజలు ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పట్టణంలో రైల్వే రోడ్డు, ధనలక్ష్మి రోడ్డు, ముక్కడిపేట, చౌడేశ్వరి కాలనీ, కొట్నూరు తదితర ప్రాంతాలలో డ్రయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు అంతా రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిఇఇ భూపతి తెలిపారు. మురుగు కాలువలు పొంగి పొర్లీ రోడ్డుపై వచ్చిన నీటిని శుభ్రం చేయిండానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దీని కోసం కొంత మంది కార్మికులను నియమించి శుభ్రం చేయిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు.
ముదిగుబ్బ మండల కేంద్రంలోని సొసైటీ బ్యాంక్‌ ఆవరణంలో ఉన్న భారీవృక్షం కూలిపోవటంతో కుమ్మర వీధికి వెళ్లే కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు
బత్తలపల్లిలో గాలి, వాన భీభత్సం
బత్తలపల్లి : మండలంలో పలుచోట్ల గాలి, వాన బీభత్సం సష్టించింది. ఆదివారం సాయంత్రం బత్తలపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్లు పడ్డాయి. గుండా కళ్యాణ మండపం ఎదురుగా చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. ఏర్పడింది. అంతేకాక రైస్‌ మిల్‌ ముందర వెనుకన నిర్మించిన ప్రహారీ కూలిపోయింది లింగారెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మిల్క్‌ డెయిరీలో పలు వస్తువులు దెబ్బతినగా, సీలింగ్‌ ఊడిపోయింది. గాలి, వానకు విద్యుత్‌ తీగలు తెగిపడడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్లను పోలీసులు జెసిబి సాయంతో పక్కకు తొలగింపజేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరింపజేశారు.