గాలివాన బీభత్సం
- బండి ఆత్మకూరులో పిడుగు పడి వ్యక్తి మృతి..
మరొకరికి గాయాలు - అవుకులో గడ్డివామి దగ్ధం
- ఆత్మకూరులో వడగండ్ల వాన - రాకపోకలకు అంతరాయం
ప్రజాశక్తి-ఆత్మకూరు/అవుకు/బండి ఆత్మకూరు
జిల్లాలోని అవుకు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం బండి ఆత్మకూరులో పిడుగు పడి పశువుల కాపరి సాని బోయిన వెంకటేశ్వర్లు (60) మృతి చెందాడు. మరొకరికి గాయలయ్యాయి. అలాగే అవుకు మండలం కునుకుంట్ల గ్రామంలోని ఎస్‌సి కాలనీలో పిడుగు పాటుకు రైతు లక్షుంపల్లె పుల్లన్నకు చెందిన గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది. వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో గాలితోపాటు ఉరుములు మెరుపుల వాన కురిసింది. సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో పక్కనే ఉన్న గడ్డివామిలో మంటలు చెలరేగాయి. బనగానపల్లె అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొనేలోపే గడ్డివామీ పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దగ్ధమైన గడ్డివామి విలువ సుమారు రూ. 60,000 ఉంటుంది. ఈ నష్టాన్ని ఎలా భరించాలని రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆత్మకూరు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు వడగండ్ల వాన పడుతుండడంతో ఇండ్లలో ఉన్న పిల్లలు ఆశ్చర్యంగా వడగండ్ల సేకరిస్తూ ఆనందంతో కేరింతలు వేశారు. గంటసేపు కురిసిన వర్షానికి ఆత్మకూరు పట్టణంలోని పలుకాలనీలలో రోడ్లపై వర్షపునీరు నిలబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరైన డ్రైనేజ్ లేకపోవడంతో ఏ కొద్దిపాటి వర్షానికి కాలనీలో నీళ్లు నిలబడిపోవడం పరిపాటిగా మారింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమికి కరెంటు కోతకు ఇబ్బందులు పడ్డ ప్రజలు వర్షం పడటంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వడగళ్లలో కూడిన వర్షిం కురిసింది.
బండి ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన సాని బోయిన వెంకటేశ్వర్లు (60), లక్ష్మీ రెడ్డితో కలిసి కెసి కెనాల్ పక్కన జింకలబరక ప్రాంతంలో పశువులను మేపుతుండగా మధ్యాహ్నం తీవ్రమైన గాలుల వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చాయి. సమీపంలో పిడుగు పడడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీరెడ్డి స్పృహ కోల్పోయి పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని మృతి చెందిన వెంకటేశ్వర్లును భోరున విలపించారు. స్పృహ కోల్పోయిన లక్ష్మీరెడ్డిని కుటుంబ సభ్యులు నంద్యాల కెవిఆర్ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు.










