బెంగుళూరు : సూర్యుడిపై అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్1 మిషన్ కక్ష్య పెంపు ప్రక్రియ నాలుగోసారీ విజయవంతమైనట్లు ఇస్రో శుక్రవారం తెలిపింది. దీంతో ఉపగ్రహం లాగ్రాజియన్ పాయింట్ 1 లోకి వెళ్తుందని, భూ కక్ష్య నుంచి దూరం అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇస్రో శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. తెల్లవారుజామున ఆదిత్య ఎల్1.. మరో కక్ష్యలోకి ప్రవేశించిందని పేర్కొంది. ఈ ఆపరేషన్ చేపట్టిన సమయంలో.. మారిషస్, బెంగుళూరు, షార్, పోర్టు బ్లెయిర్‌లో ఉన్న ఇస్రో స్టేషన్లు ఆ శాటిలైట్‌ను ట్రాక్ చేసినట్లు వెల్లడించింది. ఫిజి దీవుల నుంచి ఆదిత్య ఎల్1కు చెందిన పోస్టు బర్న్ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తున్నారు. కొత్త కక్ష్య 256 కి.మీ ఞ 121973 కి.మీ దూరంలో ఉన్నట్లు ఇస్రో పేర్కొన్నది. మళ్లీ ఈ నెల 19వ తేదీ ఉదయం 2 గంటలకు కక్ష్య పెంపు ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. తొలి మూడు కక్ష్య పెంపు ప్రక్రియలను ఈ నెల 3, 5, 10 తేదీల్లో చేపట్టారు.










