Jul 27,2023 11:19
  • మంచం పట్టిన వృద్ధులు, పిల్లలు
  • ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలంటున్న గ్రామస్తులు
  • గ్రామాలలో అంతా అపరిశుభ్రమే 

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : మండలం పరిధిలో ఉన్న పెద్దతుంబలం, పెద్దహరివనం, మండిగిరి, చిన్న హరివనం, సంతేకూడ్లురు, మదిరె, ఆరెకల్లు, ఇస్వి, హనావాలు, జలమంచి, పాండవగల్, కుప్పగల్, నాగలాపురం, కపటి తదితర గ్రామాలలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే గ్రామంలో అనేకమంది వృద్ధులు, చిన్నపిల్లలు మంచం పట్టారు. మరికొందరు కొద్దిరోజులుగా పెద్దహరివనం, పెద్ద తుంబలం పీహెచ్‌సీకి క్యూ కడుతున్నారు. ఇటీవల ఆ గ్రామం నుంచి 20 మందికి పైగా గ్రామస్థులు వైరల్‌ జ్వరాలతో పీహెచ్‌సీకి చేరుకున్నారు. దోమల నివారణకు గాను స్ర్పేయింగ్‌, ఫాగింగ్‌ చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతిఒక్కరూ దోమ తెరలు వినియోగించాలని, వేడి నీరు తాగాలని పెద్ద హరివనం పిహెచ్సి వైద్యుడు అమ్రాన్ సూచించారు.  

  • కలుషిత నీరే కారణమా ?

గ్రామాలలో వైరల్‌ జ్వరాల వ్యాప్తికి కలుషిత నీరే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామస్థులు ఆ నీటిని తాగి జ్వరాల బారిన పడుతున్నారనే వాదనలు లేకపోలేదు. మరోవైపు ఆ ప్రాంతంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో జ్వర బాధితులు పెరుగుతున్నారు. పెద్దహరివనం, పెద్ద తుంబలం పీహెచ్‌సీకి  చేరుకోవడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంతో పాటు పీహెచ్‌సీలో ఇప్పటివరకు ఆ గ్రామానికి చెందిన 117 మందికి రక్తపరీక్షలు చేశారు. వారిలో 24 మందికి వైరల్‌ జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా రోజురోజుకూ జ్వరపీడితులు పెరుగుతుండడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి జ్వరాల అదుపునకు తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతావాసులు కోరుతున్నారు.