Mar 16,2023 15:09

ప్రజాశక్తి-చందర్లపాడు: మండలంలోని కొడవటికల్లు గ్రామంలో గురువారం ఉదయం ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా  రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంలో 65శాతం ప్రజలు ఆధారపడిన వ్యవయసాయ రంగాన్ని కార్పొరేట్ ఫరం చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం చట్టాల రద్దు ప్రకటించింది. అయినా దొడ్డి దారిన వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు కట్టబెట్టాలని విధానాన్ని కొనసాగిస్తుందని అన్నారు.బి.జె.పి అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజా సంపదనంతా పెట్టుబడడుదారులు, కార్పొరేట్లుకు దోచి పెడుతుందనీ, దేశ ప్రజలపై మరింత పన్నుల భారం మోపి మధ్య తరగతి సామాన్య ప్రజలు జీవించలేని స్థితికి నెట్ట వేయబడినారు. దేశ ప్రజలు కూడ బెట్టుకున్న ప్రభుత్వరంగ ఆస్తులను తెగనమ్ముకుంటుంది. కార్మికుల హక్కులను కాలరాస్తు 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను, రైతు హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తుంది. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుంది. రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచివుంది.దేశ యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అయిన అన్ని పంటలకు మద్దుతు ధరల చట్టం, విద్యుత్ సంస్కరణల బిల్లు 2022 రద్దు, - స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు, - కేరళ తరహా రుణ విమోచన చట్టం, - రైతాంగ అప్పులు రద్దు ,- అన్ని పంటలకు భీమా సౌకర్యం కల్పించడం, గ్రామీణ ఉపాధి హామికి నిధులు పెంపు, పరిశోధనలకు నిధులు పెంపు - చేపట్టాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కనీస వేతనం 26 వేలు, పెన్షన్ 10 వేలు నిర్ణయించాలి - కాంట్రాక్ట్ పద్ధతి ఎత్తివేసి పర్మినెంట్ ఉద్యోగ విధానం అమలు చేయాలి - 200 రోజులు ఉపాది హామి పనిదినాలు కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పి.ఎస్. యు లను | (పెట్టుబడుల ఉపసంహరణ) ప్రైవేటీ కరించడం ఆపాలి. ఆహార పదార్థాలు, నిత్యావసరాల సరుకుల మీద, పేద రైతులకిచ్చే వ్యవసాయ పరికరాల మీద జి.యస్.టి.ని ఎత్తి వేయాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై సుంకాలనుతగ్గించాలి.అర్హులందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి.2013 భూసేకరణ చట్టం ద్వారా భూములుకోల్పోయిన రైతులకు మార్కెట్ రేటుకు 4 రెట్లు అదనంగా పరిహారం చెల్లించాలి. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలి - రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజి, రాజధాని అమరావతికి నిధులు పెంపు, పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్ - విజయవాడ విశాఖ మెట్రో అమలు, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు చేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. డిమాండ్స్ తో జరుగు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలుసైదులు,కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు గుమ్మళ్ళ ఏడుకొండలు,రైతులు జంపాని వీరరాఘవయ్య,నాగినేని వెంకటరమయ్య, జంపాని అశోక్, కొటారు నాగేశ్వరరావు,యం శివశంకర్,జంపాని రాంబాబు,రాయిడి వెంకటేశ్వరరావు,వేగినేటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.