- కరపత్రాలు విడుదల చేసిన రైతు సంఘాల నాయకులు..
ప్రజాశక్తి-ఉంగుటూరు(కైకరం) : ఈనెల 12న ఏలూరులో ధాన్యం గిట్టుబాటు ధర - కొనుగోలు సమస్యలపై జిల్లా స్థాయి రైతు సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ చెప్పారు. గురువారం ఉంగుటూరు మండలం కైకరం లోని ప్రజా సంఘాల కార్యాలయంలో సదస్సు కరపత్రాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు విడుదల చేశారు.ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు ఏమాత్రం సరిపోదన్నారు. క్వింటాల్ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సాధారణ రకానికి రూ.2183, ఏ గ్రేడ్ కు రూ.2203గా ఉందన్నారు. ఈ మద్దతు ధరకు అదనంగా కేరళలోని వామపక్ష ప్రభుత్వం రూ.900 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తోందని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.










