Oct 21,2021 07:18

లండన్‌ : జిఐఎఫ్‌ ప్లాట్‌ఫారం జిఫీ కొనుగోలుపై దర్యాప్తు సందర్భంగా విధించిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ కాంపిటీషన్‌ రెగ్యులేటర్‌ 6.96కోట్ల డాలర్లను జరిమానా విధించింది. కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ (సిఎంఎ) బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. తమ ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగానే ఫేస్‌బుక్‌ ఉల్లంఘించిందని పేర్కొంది. ఏ కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదని తెలియచెప్పేందుకే ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. కాగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపిది. తమ దర్యాప్తు కొనసాగుతుండగా, జిఫీతో పోటీ పడేందుకు వీలుగా, జిఫీతో తన కార్యకలాపాలను విలీనం చేయకుండా వుండడానికి అవసరాలకు అనుగుణంగా తన పూర్తి వివరాలను అందించడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని సిఎంఎ పేర్కొంది. ఎన్నిసార్లు హెచ్చరించినా అవసరమైన సమాచారం ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ తిరస్కరించింది. అందువల్ల ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాచేసిందని భావించాల్సి వచ్చిందని సిఎఎం పేర్కొంది. కీలకమైన సమాచారం ఇవ్వడానికి తిరస్కరించడమంటే ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందని ఫేస్‌బుక్‌కు స్పష్టం చేశామని తెలిపింది.