వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు ఆరుగంటలపాటు నిలిచిపోయాయి. ఇది అతిపెద్ద వైఫల్యమని వెబ్‌సైట్ మానిటరింగ్ గ్రూప్ పేర్కొంది. సోమవారం రాత్రి 9 గంటల నుండి వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలు నిలిచిపోవడంతో.. వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బందులకు గురయ్యారు. 7 గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి వాట్సప్ సేవలను పునరుద్ధరించారు. ఫేస్‌బుక్ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం.
కాగా, విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడం వంటి చర్యలను చేపట్టకుండా లాభాపపేక్ష కోసం పనిచేస్తుందంటూ నిఘా వర్గాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరుగంటలపాటు నిలిచిపోవడం ఫేస్‌బుక్‌కు ఇది రెండవదెబ్బని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్లకు పైగా వినియోగదారులను కలిగిన ఫేస్‌బుక్ వాటాలు సోమవారం ఒక్కసారిగా 4.9 శాతానికి పడిపోయాయని, సెప్టెంబర్ మధ్యనుండి సుమారు 15 శాతానికి క్షీణించింది. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. వాట్సప్‌ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు.
ఈ సందర్భంగా సేవల అంతరాయంపై ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలకు, వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారికి క్షమాపణలని ట్వీట్ చేశారు. నిలిచిపోయిన సేవలను పునరుద్ధరించడంతో తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉందని, తమతో సహకరించినందుకు ధన్యవాదాలని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కాగా, ఫేస్‌బుక్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో జుకర్‌బర్గ్‌కి ఏడు బిలియన్ డాలర్లు (52 వేల కోట్లు) నష్టం వచ్చినట్లు సమాచారం. దీంతో సోమవారం షేర్లు పడిపోవడంతో జుకర్‌బర్గ్ ర్యాంక్ బిల్‌గేట్స్ కంటే దిగువకు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఐదో స్థానానికి చేరింది. సూచిక ప్రకారం.. వారాల వ్యవధిలో సుమారు 140 బిలియన్ డాలర్లను కోల్పోయాడు.










