పార్వతీపురంటౌన్: ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధికాదని క్రీడా సాధికారి సంస్థ చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యూత్ ఫెస్ట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనా ర్యాలీని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ఆర్‌సిఎం స్కూల్ వరకు నిర్వహించారు. ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా చీఫ్ కోచ్ మాట్లాడుతూ హెచ్‌ఐవి వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. హెచ్‌ఐవి చాలా సున్నితమైన వైరస్ అని అన్నారు. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తీసుకున్నా, వారిని తాకినా ఈ వ్యాధి వ్యాప్తి చెందదని చెప్పారు. ఎయిడ్స్, హెచ్‌ఐవి బాధితులు ఉపయోగించిన వస్తువులను ఎవరైనా వినియోగించవచ్చని పేర్కొన్నారు. వ్యాధిగ్రాస్తు లను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేసినా ఎయిడ్స్ వ్యాధి సోకదని వివరించారు. వ్యాధిగ్రస్తులు ఉపయోగించే సూదులను వాడకూడదన్నారు. అరక్షిత శృంగారం వల్ల హెచ్‌ఐవి బారిన పడే అవాశాలున్నాయని, కండోమ్ ఉపయోగించడం మంచిదని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఐవి వ్యాధి సోకిందంటే చనిపోవడం తప్ప మార్గం లేదని భావించేవారని, ప్రస్తుతం వైద్యశాస్త్రం కూడా ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
హెచ్‌ఐవిని సమూలంగా, శాశ్వతంగా తగ్గించలేక పోయినప్పటికీ ఆ వ్యాధితో పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరిచేందుకు చాలా మందులు అందుబాటులో ఉన్నాయనన్నారు. ఏఆర్డీ - యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకోవడం ద్వారా బాధితులు కూడా ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు వైరల్ లోడ్, సీడీ4 కౌంట్ పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. హెచ్‌ఐవి సోకిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించ డానికి ఒక్కొక్కరికి ఒక్కోలా సమయం పడుతుం దన్నారు. రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ఈ వ్యాధి లక్షణాలు అంత ఆలస్యంగా బయటపడతాయని, ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవని తెలిపారు. హెచ్‌ఐవి లేదా ఎయిడ్స్ సోకిందన్న అనుమానం ఉంటే మూడు నెలలకోసారి పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి వచ్చిందా, లేదా తెలుస్తుందన్నారు. వైరస్ తగ్గిపోతే ఇక వ్యాధి వ్యాపించదని, ఏఆర్టీ తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో వైరల్ వ్యాప్తి రోజురోజుకీ తగ్గిపోయి, చివరకు పరీక్షల్లో గుర్తించలేని స్థాయికి చేరిపోతుందన్నారు. చాలామంది వ్యాధి తగ్గిపోయిందనే ఉద్దేశంతో మందుల వాడకం ఆపేస్తున్నారని అందువల్ల శరీరంలో వైరస్ లోడ్ తగ్గినా, మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉండవచ్చని వివరించారు. వైరస్ లోడ్ పూర్తిగా తగ్గినా బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టు మేనేజర్ పి. బాలాజీ, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డాక్టర్ టి. జగన్మోహన రావు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వినోద్, డివిఎస్ గుప్త, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..










