ప్రజాశక్తి - గరుగుబిల్లి : రెవెన్యూ శాఖ అసందర్భ నిర్ణయంతో మండలంలోని నాగూరు గ్రామస్తులకు నీడకరువైంది. ఇళ్ల స్థలాల నిమిత్తం కేటాయించిన స్థలాన్ని పరిశ్రమకు కేటాయించొద్దని నాగూరు గ్రామస్తులు అధికారులను ఆశ్రయించిన ఫలితం శూన్యం. గతంలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్‌ఇ పిడిపి పథకం కింద ఇంద్రాణి క్లస్టర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున కామన్ ఫెసిలిటీ నిర్మాణానికి కేటాయించినట్లు అధికారులు చెప్పడంతో పంచాయతీ పెద్దలు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ ఇండిస్టీ నిర్మాణం నిమిత్తం గ్రామపంచాయతీ తీర్మానం ఇవ్వాలని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తమపై ఒత్తిడి చేస్తున్నట్టు సర్పంచ్ పేర్కొన్నారు. సర్వేనెంబర్ 102/1లో గల భూమి నిరుపయోగంగా, ఉందని ఎవరు ధ్రువీకరించారో తమకు తెలియదని ఈ విషయంపై గ్రామపంచాయతీ తరఫున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సర్పంచ్ శిరీషతో పాటు పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ భూమి గ్రామంలోని పేదల ఇళ్ల స్థలంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించుకొనేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ భూమి తప్ప గ్రామంలో ఎక్కడా ప్రభుతం భూమి లేనందున, దీన్ని ఇండిస్టీకి కేటాయించొద్దని అధికారులను గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ భూమిని నిరుపేదలైన వారికి భవిష్యత్తులో ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు పంచాయతీ తీర్మానించిందని, అయితే ప్రస్తుతం ఇదే స్థలాన్ని కామన్ ఫెసిలిటీ నిర్మాణానికి కేటాయించేందుకు గ్రామపంచాయతీ తీర్మానం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో 2500 జనాభా, అలాగే 1650 పైగా ఓటర్లు ఉన్నారని, భవిష్యత్‌లో జనాభా పెరిగే అవకాశం ఉన్నందున భవితరాలకు గుర్చి ఆలోచన చేయాలని కోరుతున్నారు. గ్రామంలో దాదాపు 40 రజక కుటుంబాలున్నాయని, రజకులు దోభీఖానాలను నిర్మించుకునేందుకు కొంత స్థలం కేటాయించేందుకు ఇప్పటికే గ్రామసభలో ప్రజల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానించినట్టు సర్పంచ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్‌డిఒలను ఆశ్రయిస్తామన్నారు.
ఒకప్పుడు కాలేజీ కోసం
ప్రభుత్వ జూనియర్ కాలేజీ కోసం ఈ స్థలం ఒక్కప్పుడు కేటయించారు. అయితే మండలానికి కాలేజీ మంజూరు కాకపోవడంతో ఇటీవల ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పుడు పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించారు.
నాకు తెలియదు
నాగూరు పంచాయతీ భూములకు సంబంధించిన నాకంటే ముందు ఉన్న అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు అనుమతులు వచ్చాయి. అందుకే పంచాయతీని తీర్మానం అడుగుతున్నాం. ఈ భూములకు సంబంధించి అన్ని రకాల అనుమతులు ఉన్నా పంచాయతీ అనుమతి లేకపోవడం వల్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ను పంచాయతీ అనుమతుల కోసం పంపించాం. దీనిలో పెద్ద విషయం ఏముంది?
జివి జనార్ధన్, తహశీల్దార్.
అధికార దుర్వినియోగం
రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ సర్పంచ్ గానీ, ఇతర వార్డు మెంబర్లకు గాని అలాగే గ్రామ ప్రజలకు గానీ ఎలాంటి నోటీసులు మంజూరు చేయకుండా ఈ స్థలాన్ని పరిశ్రమాభివృద్ధికి అప్పు జెప్పాలనుకోవడం అధికార దుర్వినియోగం. పంచాయతీ అనుమతులు లేకుండా సమయం మించి పోయిందని చెప్పి సంతకాలు పెడితే ఇండిస్టీకి స్థలం ఇవ్వటానికి సిద్ధమని ఆర్‌ఐ ర్ అనడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.
కేతిరెడ్డి శిరీష, సర్పంచ్










